APFDC Chairman Posting: ఏపీఎఫ్‌డిసి ఛైర్మన్‌ పోస్టింగ్‌ వ్యవహారంపై అప్పుడే రగడ.. టీడీపీలో ఏం జరుగుతోందని చర్చ

Best Web Hosting Provider In India 2024

APFDC Chairman Posting: ఏపీలో ప్రభుత్వ అధికారుల నియామకాలే వివాదాస్పదంగా మారాయనుకుంటే నామినేటెడ్ పదవుల వ్యవహారంపై కూడా చర్చగా మారింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు గడిచింది. కొత్త ప్రభుత్వం కుదురుకునే క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగులు జరుగుతున్నాయి. ఈ కసరత్తే ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు.

కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ వ్యవహారాలపై ఇప్పటికే రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. కీలక నియామకాల్లో ఇంటెలిజెన్స్ వైఫల్యంతో పాటు కొందరు అధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గోపాలకృష్ణ ద్వివేది వంటి అధికారులకు పోస్టింగ్ ఇచ్చి తర్వాత జిఏడిలో రిపోర్ట్ చేయాలని మరో జీవో జారీ చేశారు. అధికారుల పోస్టింగ్ కసరత్తు పూర్తి కాకముందే నామినేటెడ్ పదవుల వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనగా ఉంది. పార్టీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఫీడ్ బ్యాక్ ఫారం పంపి ఆ ప్రాంతంలో కృషి చేసిన నాయకుల్ని గుర్తించే పని చేపట్టారు. ప్రతి జిల్లాలో మండల స్థాయి, నియోజక వర్గ స్థాయి, నగర స్థాయిలో నాయకుల్ని గుర్తించే కసరత్తును ఇప్పటికే టీడీపీ ప్రారంభించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీ కోసం నిలబడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తోంది.

ఏపీ ఎఫ్‌డిసి నియామకంపై వివాదం…

త్వరలో నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయనుండటంతో ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్ పోస్టు కోసం సినీ ప్రముఖులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వైసీపీలో కీలంగా వ్యవహరించిన ఘట్టమనేని ఆదిశేషగిరి రావు పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ ముఖ్య నాయకుడి సిఫార్సుతో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవిని ఆదిశేషగిరి రావుకు ఇస్తారనే ప్రచారం ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడి సిఫార్సుతో ఈ పోస్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలియడంతో టీడీపీ అనుకూలురైన సినీ ప్రముఖుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. టీడీపీతో పాటు బీజేపీ, జనసేనలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ స్వయంగా నటుడు కావడంతో పరిశ్రమపై ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలకు కూడా జనసేనకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యుడిగా ఉన్నారు. ఏపీ ఎఫ్‌డిసి వంటి నియామకాలపై అందరికి అమోదయోగ్యమైన వ్యక్తిని నియమించాలనే చర్చ హైదరాబాద్ ఫిలిం సర్కిల్స్‌లో జరుగుతోంది.

ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ పదవి కోసం సినీ ప్రముఖులు చాలామంది ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్‌ ద్వారా కేఎస్‌ రామారావు, వంటి వారు ఆ పదవిని ఆశిస్తున్నారు. ప్రసన్న కుమార్ వంటి ఒకరిద్దరు కూడా టీడీపీ ప్రభుత్వంలో తమకు అవకాశం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆదిశేషగిరి రావు పేరు తెరపైకి రావడం, ఆయనకు టీడీపీ ముఖ్య నాయకుడు సిఫార్సు చేస్తున్నారనే ప్రచారాలతో సినీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. వైసీపీలో కొనసాగి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నా వ్యక్తిని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ పదవి ఇవ్వాలని భావించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

చంద్రబాబుకు తెలిసే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఆయన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయా అనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లలో సినీ పరిశ్రమను చిన్న చూపు చూసేలా వ్యవహరించారని, ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయాలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఈ అంశంపై జనసేన అధినేత దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు భావిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsGovernment Of Andhra PradeshJanasenaTdpChandrababu Naidu
Source / Credits

Best Web Hosting Provider In India 2024