Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్ – ఈనెల 18న అక్టోబ‌ర్ నెల ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌

Best Web Hosting Provider In India 2024


తిరుమల శ్రీవారి అక్టోబ‌ర్ నెల ద‌ర్శ‌న టిక్కెట్లను జులై 18 నుంచి విడుద‌ల చేయ‌నుంది. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) గురువారం పేర్కొంది. మరోవైపు భక్తులకు ఇచ్చే అన్న ప్రసాదాల నాణ్య‌త పెంచామ‌ని టీటీడీ అధికారులు తెలిపారు. మ‌రోవైపు గ‌త మూడు రోజులుగా తిరుమలలో భ‌క్తులు ర‌ద్దీ కూడా పెరిగింది.

సాక్షాత్కార వైభవోత్స‌వాలు…

మూడు రోజుల పాటు జ‌రిగే సాల‌క‌ట్ల సాక్షాత్కార వైభవోత్స‌వాలు ప్రారంభ‌మయ్యాయి. ఇందులో భాగంగా ఉద‌యం సుప్ర‌భాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల‌సేవ‌, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ముఖ మండపంలో శ్రీ‌దేవి, భూదేవ స‌మేత క‌ళ్యాణ వెంటేశ్వ‌ర‌స్వామి వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. పాలు, పెరుగు, తేనే, ప‌సుపు, చంద‌నం, కొబ్బ‌రినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. రాత్రి ఏడు గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నంపై స్వామివారు ఆల‌య మ‌డ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రెండో రోజు హ‌నుమంత వాహ‌నంపై, మూడో రోజు గరుడ వాహ‌నంపై స్వామివారు విహ‌రించి భ‌క్తులను అనుగ్ర‌హిస్తారు.

పెరిగిన భక్తుల రద్దీ….

మ‌రోవైపు తిరుమలకు యాత్రికుల ర‌ద్దీ పెరిగింది. గ‌త మూడు రోజులుగా క్రమంగా పెరుగుతూ వ‌స్తుంది. 31 కంపార్ట్‌మెంట్‌ల్లో యాత్రికులు వేచి ఉంటున్నారు. అలాగే యాత్రికుల స‌ర్వ‌ద‌ర్శ‌నానికి క‌నీసం 18 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. బుధ‌వారం ఒక్క‌రోజే 73,353 మంది యాత్రికులు ద‌ర్శించుకున్నారు. అందులో 28,444 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. బుధ‌వారం ఒక్క‌రోజే టీటీడీకి రూ.3.05 కోట్ల హుండీ ఆదాయం వ‌చ్చింది.

ప్ర‌తిరోజు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి దేశ విదేశాల నుండి వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు ఇచ్చే అన్న ప్ర‌సాదాల నాణ్య‌త పెరిగింద‌ని టీటీడీ ఈవో జే.శ్యామ‌ల రావు తెలిపారు. జేఈఓ వీర‌బ్ర‌హ్మంతో క‌లిసి ఈవో శ్యామ‌ల‌రావు తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్ర‌సాద కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. ప్ర‌తి రోజు రెండు ల‌క్ష‌ల మందికి అన్న ప్ర‌సాదాలు అందిస్తోన్నామ‌ని ఈవో శ్యామ‌ల‌రావు తెలిపారు. అన్న ప్ర‌సాదాలు రుచిక‌రంగా, నాణ్య‌త‌గా ఉండేందుకు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

అన్న‌ప్ర‌సాదాలు త‌యారీ భ‌వ‌నంలో అధునాత శాస్త్ర, సాంకేతికను ఉప‌యోగించి కూర‌గాయ‌లు, ముడి స‌రుకుల నిల్వ‌, పారిశుద్ధ్యం, ఆహార ప‌దార్థాల‌ను త‌నిఖీ చేసేందుకు అధికారుల‌ను నియ‌మించామ‌ని తెలిపారు.

ప‌ది నుంచి ప‌దిహేనేళ్ల క్రితం నాటి అన్న ప్ర‌సాద త‌యారీ యంత్రాల‌ను తొల‌గించి, వాటి స్థానంలో కొత్త యాంత్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. భ‌క్తుల ర‌ద్దీ పెరుగుద‌ల‌కు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. అలాగే అన్న ప్ర‌సాద విభాగంలో ప‌ని చేసే సిబ్బందిని పెంచుతామని అన్నారు. ఇప్ప‌టికే దేశంలోని ప్ర‌ముఖ చెఫ్‌లు, క్యాట‌రింగ్ నిపుణుల‌తో కూడిన క‌మిటీ స‌మ‌గ్ర నివేదిక ఇచ్చింద‌ని, ఈ నివేదికను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చ‌ర్య‌లు చేప‌ట‌డ‌తామ‌ని ఈవో శ్యామ‌ల‌రావు తెలిపారు.

టీటీడీ సీరియస్….

తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయ మైన చర్య అని టీటీడీ తీవ్రంగా ఖండించింది.

నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియో ని క్రియట్ చేశారు. కంపార్ట్మెంట్ లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయ్యింది.

సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో, వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.

రిపోర్టింగ్ – జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

WhatsApp channel

టాపిక్

TtdAndhra Pradesh NewsTrending Ap

Source / Credits

Best Web Hosting Provider In India 2024