Best Web Hosting Provider In India 2024
Hyderabad Realtor Murder : హైదరాబాద్ లో సంచలనమైన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కమ్మరి కృష్ణను అతడి సొంత కుమారుడే హత్య చేయించినట్లు పోలీసుల విచారణ బయటపడింది. అతడు మొదటి భార్య కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు విచారణలో తేలింది. కమ్మరి కృష్ణకు ముగ్గురు భార్యలు. మూడో భార్యకు ఆస్తి మొత్తం రాసిస్తున్నాడనే కక్షతో మొదటి భార్య కుమారుడు సుపారీ ఇచ్చి తండ్రిని పథకం ప్రకారం హత్య చేయించాడని పోలీసులు నిర్థారించారు. తండ్రిని హత్య చేయించడానికి ముగ్గురికి రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కత్తులు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
హైదరబాద్ గండిపేట మండలం హైదర్షాకోట్కు చెందిన కమ్మరి కృష్ణ (55) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు షాద్‌నగర్ కమ్మదనంలో ఓ ఫామ్ హౌస్ ఉంది. ఈ నెల 10న కమ్మరి కృష్ణ తన మూడో భార్య పావనితో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లాడు. కృష్ణ బాడీగార్డ్ బాబాతో కలిసి మరో ఇద్దరు కృష్ణపై కత్తులతో దాడి చేసి గొంతుకోసి హత్య చేశారు. కృష్ణ అరుపులతో పై అంతస్తులో ఉన్న భార్య బయటకు వచ్చి అతడిని శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అయితే కమ్మరి కృష్ణ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణ బాడీగార్డు బాబా కొన్నేళ్లుగా పనిచేస్తుండగా ఏడాది క్రితం అతడిని పని నుంచి తొలగించారు. సరిగ్గా పనిచేస్తానని కృష్ణను బతిమాలుకోవడంతో ఇటీవల అతడిని పనిలో పెట్టుకున్నాడు. కృష్ణ ఫామ్ హౌస్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న బాబా… ఫోన్ ఛార్జింగ్ పేరుతో అక్కడకు వచ్చి మరో ఇద్దరి సాయంతో కృష్ణపై కత్తులతో దాడి చేశారు. ఇద్దరు కృష్ణ కాళ్లు చేతులు పట్టుకోగా ఒకడు గొంతు కోసి పరారయ్యారు. రియల్టర్ కృష్ణకు రూ.వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. కృష్ణ మొదటి భార్యకు ఇద్దరు కొడుకులున్నారు.
కమ్మరి కృష్ణకు ముగ్గురు భార్యలు కాగా ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కృష్ణ వద్ద గతంలో బాడీ గార్డ్‌గా పనిచేసిన బాబాను ఏడాది క్రితం విధుల్లోంచి తీసేశాడు. అయితే కృష్ణ చేసిన ఆక్రమణలలో బాబా భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తోంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బాబాను కృష్ణ పనిమాన్పించేశాడు. అయితే 15 రోజుల క్రితమే బాబా మళ్లీ కృష్ణ వద్ద పనిలో చేరాడు. అదును చూసి కమ్మరి కృష్ణను హత్య చేసి పరారయ్యాడు.
క్రిమినల్ మైండ్ తో ఆక్రమణలు
రియల్టర్ కమ్మరి కృష్ణ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని తెలుస్తోంది. తన క్రిమినల్ మైండ్ తో వందల కోట్లు వెనకేశాడని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో కేకే కన్వెన్షన్ ద్వారా కమ్మరి కృష్ణ అందరికీ తెలిసిన వ్యక్తే. వివాదాల్లో ఉన్న భూములను కొట్టేసి, సామాన్యులను చాలా ఇబ్బందులకు గురిచేసేవాడని అతడిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. కమ్మరి కృష్ణ హత్యపై ముందు ప్రత్యర్థులే చంపించారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ తగాదాల వల్లే అతడ్ని హత్య చేశారని పోలీసులు గుర్తించారు.
సంబంధిత కథనం
టాపిక్