Sunday motivation: ఆనందమయ జీవితానికి భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు

Best Web Hosting Provider In India 2024

భగవద్గీతలో లేని విషయం లేదు. ప్రతి సమస్యకు అందులో సమాధానం ఉంటుంది. ప్రశ్న మన మదిలో ఉంటే చాలు. అలాంటి పవిత్ర గ్రంథం నుంచి మనం నేర్చుకుని, నిత్య జీవితంలో పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెల్సుకోండి.

1. ప్రయత్నం మీద దృష్టి పెట్టండి. ఫలితం మీద కాదు.

ఫలితం ముఖ్యమా? ప్రయత్నం ముఖ్యమా అంటే.. ప్రయత్నమే అనాలి. మంచి ఫలితం రావాలంటే దాన్ని పొందడానికి చేసే పనులు, ప్రయత్నం మెరుగవ్వాలి. మీ చేతిలో ఉంది ప్రయత్నం మాత్రమే. ఫలితం గురించి కచ్చితంగా చెప్పలేం. మీరు ఊహించినంత ఫలితం లేకపోతే అనవసరంగా భరించలేని బాధ పడాల్సి వస్తుంది. అలాగే ఫలితం ఏమొచ్చినా దానికి కారణం మీరే అనుకోకూడదు. మీ ప్రయత్నం ఒక్కటే ఫలితాని నిశ్చయించదు. సందర్భాలు, మనుషులు, చాలా రకాల కారకాలు ఫలితాన్ని మార్చేస్తాయి. అలాగే ఆశించింది జరగకపోతే నిరాశపడకూడదు. దాని మీద ఆసక్తి తగ్గించుకోకూడదు. ప్రయత్నం ఆపకూడదు.

2. మోహం,దురాశ, కోపం

మోహం, దురాశ, కోపం.. ఈ మూడు స్వీయ పతనానికి కారణం అవుతాయి. చాలా సమస్యలకు మూల కారణాలు ఇవే. ఒక వస్తువు మీద మోహం పెంచుకోవడంతో సమస్య మొదలవుతుంది. మోహం కాస్త దురాశగా మారుతుంది. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. మీరనుకున్నంత పొందలేనప్పుడు అది కోపంగా మారుతుంది. మీ మనశ్శాంతిని దూరం చేసేది ఇదే.

3. సముద్రం లాగా నిలకడగా ఉండాలి

సముద్రంలోకి నదీ జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ వాటివల్ల ఇసుమంత కదలిక కూడా సముద్రంలో రాదు. ఆ నదీ జలాల్లాగే మన మనసులోకి కూడా ఆలోచనల ప్రవాహం చొరబడుతూనే ఉంటుంది. అయినా కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. దేని గురించి చింతించకూడదు. చెడు ఆలోచనలు మీ మెదడును తట్టడానికి ప్రయత్నిస్తాయి. అయినా నిగ్రహంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

4. తట్టుకుని నిలబడాలి

కాలాలే మారిపోతూ ఉన్నప్పుడు మనకొచ్చే బాధలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి. వస్తుంటాయి పోతుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకుని నిలబడాలి. వాటివల్ల క్రుంగిపోకూడదు. మార్పు మాత్రమే శాశ్వతం. కాబట్టి దేని గురించి దిగులుపడకండి.

5. అంతా మంచికే..

జరిగిపోయింది మీ మంచికే, జరుగుతోంది మీ మంచికే, జరగబోయేదీ మంచికే. గతం గురించి తలచుకోవడం, భవిష్యత్తు గురించి దిగులుపడటం అనవసరం. మనకు ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. ప్రతి విషయంలో ఏం జరిగినా మంచికే అనే సానుకూల దోరణి ఉండాలి. సమయం మీకు ఇప్పుడు అనుకూలంగా లేదేమో, కానీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి. నమ్మకంతో ముందుకెళ్లండి చాలు.

 

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024