Best Web Hosting Provider In India 2024
Road Accident in Visakhapatnam : విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై నలుగురు ప్రయాణిస్తుండగా ట్యాంకర్ ఆ స్కూటీని ఢీకొట్టంది. దీంతో తల్లి, కూతుళ్లు అక్కడికక్కడే మరణించారు. తాత, మనువడు తీవ్రగాయాలతో బయటపడ్డారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ రోడ్డు ప్రమాద ఘటన శనివారం విశాఖపట్నంలోని గాజువాకలో పంతులుగారి మేడ వద్ద జరిగింది. విశాఖపట్నంలోని అగనంపూడి దిబ్బపాలెం కాలనీకి చెందిన జాజుల సూరిబాబు, ఆయన భార్య పార్వతి, కుమార్తె సత్యవతి, మనువడు, సత్యవతి కుమారుడు పార్థు శనివారం షీలానగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తమ పనులు ముగించుకొని స్కూటీపై పాత గాజువాక జాతీయ రహదారి మీదుగా అనగంపూడి దిబ్బపాలెం కాలనీలోని ఇంటికి వెళ్తున్నారు.
అయితే పంతులుగారి మేడ ప్రాంతానికి వచ్చేసరికి జాజుల సూరిబాబు కుటుంబం ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్ బలంగా ఢీకొంది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న నలుగురు తూలిపోయారు. అందులో పార్వతి సత్యవతి కుడివైపుకు పడిపోయారు. వీరిద్దరూ ట్యాంకర్ టైరు చక్రాల కిందకు దూసుకుపోయారు. వీరిద్దరిపైన ట్యాంకర్ దూసుకెళ్లింది. దీంతో సత్యవతి, పార్వతి తలలు నుజ్జునుజ్జయ్యాయి. వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
తాత సూరిబాబు, మనువడు పార్థు ఎడమ వైపుకు తూలిపోవడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. గాయపడిన సూరిబాబు, పార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన పార్వతి, సత్యవతిల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
స్కూటీని ఢీకొని ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును చేస్తున్నారు.
వివాహితను ఈడ్చికెళ్లిన టిప్పర్…
విశాఖపట్నం జిల్లాలో మరో రోడ్డు ఘటనలో వివాహిత మృతి చెందింది. కొద్ది నిమిషాల్లో పుట్టింటికి చేరుకోవాల్సిన వివాహిత దుర్మరణం పాలైంది. శనివారం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడకు చెందిన సరకాన సతీష్, ఆయన భార్య రేవతి, కుమారుడు భవ్యేష్‌తో కలిసి గాజువాక సమీపంలో ఉన్న మిందిలోని తన అత్తవారింటికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సతీష్, కుమారుడు భవ్యేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
జాతీయ రహదారిపై అగనంపూడి ఆసుప్రతి ఎదురుగా సతీష్ కుటుంబం ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొంది. దీంతో సతీష్, భవ్యేష్ పక్కకు తూలిపోయారు. రేవతిని టిప్పర్ కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సతీష్, కుమారుడు భవ్యేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో దువ్వాడ పోలీసులు అక్కడి చేరుకున్నారు. దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన రేవతి మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ – జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్