Best Web Hosting Provider In India 2024
The Goat Life OTT Release: ప్రభాస్ సలార్ సినిమాలో విలన్‌గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఇతర భాషల్లో కీ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. అలాంటి పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ సినిమానే ఆడు జీవితం.
మలయాళంలో ఆడు జీవితం అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా మిగతా భాషల్లో ది గోట్ లైఫ్‌గా విడుదలైంది. మార్చి 28న ఇండియన్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ మధ్య వరుసగా మలయాళ సినిమాలు సూపర్ హిట్ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. వాటిలో ది గోట్ లైఫ్ కూడా ఒకటి.
రూ. 88 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆడు జీవితం సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 151.38 కోట్లు కొల్లగొట్టింది. ఎంతో హిట్ సాధించిన ది గోట్ లైఫ్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రతిసారి రూమర్ డేట్స్ వార్తల్లో నిలిచాయి. కానీ, సినిమా మాత్రం ఓటీటీలోకి రాలేదు.
ఇప్పుడు తాజాగా ఆడు జీవితం మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుందని ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మొదట్లో ది గోట్ లైఫ్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుందని టాక్ వచ్చింది. దాంతో హాట్‌స్టార్‌లోనే ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ అవనుందని ప్రచారం జరిగింది. కానీ, తాజా అనౌన్స్‌మెంట్‌తో ది గోట్ లైఫ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారినట్లు కన్ఫర్మ్ అయిపోయింది.
ఆడు జీవితం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జూలై 19 నుంచి మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ది గోట్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయంపై తాజాగా నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ రిలీజ్ చేసింది. దీంతో ఇండియన్ ఆడియెన్స్‌కు మరో మంచి సినిమా ఓటీటీలో చూసేందుకు లభించినట్లు అయింది.
ఇదిలా ఉంటే, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (మలయాళంలో ఆడు జీవితం) సినిమాలో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై ఆడు జీవితం చిత్రాన్ని నిర్మించింది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా ది గోట్ లైఫ్ సినిమా తెరకెక్కించారు. పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమాగా ది గోట్ లైఫ్ నిలిచింది.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ది గోట్ లైఫ్ సినిమాను దాదాపుగా 12 ఏళ్లపాటు చిత్రీకరించారని పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.