Best Web Hosting Provider In India 2024

అనకాపల్లి: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘనమైన మెజార్టీతో విజయం పొందేందుకు కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని ఉమ్మడి విశాఖ జిల్లాలో వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో స్థానిక పెంటకోట కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయానికి , అలాగే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైయస్ఆర్‌సీపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారని చెప్పారు. అర్హత ఉండి, పథకాలు అందని వారిని గుర్తించి వారికి కూడా లబ్ధి అందేలా చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని సంక్షేమ,అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అవి అసత్యాలని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత పార్టీ శ్రేణులకు, కన్వీనర్లకు, గృహసారధులకు ఉందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాల గురించి కన్వీనర్లు, గృహసారథులు ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఆయన కోరారు. వైయస్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే పథకాలన్నీ నిలిచిపోతాయని ఆయన అన్నారు.
విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనివలన ఉత్తరాంధ్ర విశేష అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీని గెలిపించి, 2024 ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీదే విజయమన్న సంకేతాలు ప్రజలకు అందించాలని సుబ్బారెడ్డి సూచించారు.
మార్చి 18వ తేదీ నుంచి సచివాలయ కన్వీనర్లకు, గృహసారధులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అందువల్ల పార్టీ శ్రేణులు సుధాకర్ విజయానికి కష్టపడి పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మంత్రి అమర్నాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి మాట్లాడుతూ.. ప్రజల బాగోగులను తెలుసుకునే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అనేక పరిశ్రమలను తీసుకువస్తున్నారని తెలియజేశారు.
ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. పార్టీలో జండా మోసే వారికి న్యాయం జరగాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకులు దాడి రత్నాకర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలనను అందిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు నేరుగా అందజేస్తున్న ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. దీనివలన వైయస్ జగన్ 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన అన్నారు. సచివాలయం కన్వీనర్ల సలహాలను సచివాలయ సిబ్బంది పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొని వైయస్ జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ.. తమకు పదవులు రాలేదని పార్టీ శ్రేణులు నిరాశ చెందకూడదని విజ్ఞప్తి చేశారు. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అవకాశాలు వస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగే ఓటింగ్ విషయంలో ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ గెలిస్తే పార్టీ 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఆయన చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు నాయకుడు జైవీర్ విద్యార్థుల సమస్యల గురించి ప్రస్తావించారు.
ఈ కార్యక్రమానికి అనకాపల్లి వైయస్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షులు జానకిరామరాజు అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు , దాడి వీరభద్రరావు, కార్పొరేటర్లు జాజుల ప్రసన్న లక్ష్మి, లక్ష్మీ సౌజన్య, మందపాటి సునీత, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పలక యశోద రవి, కసింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు జడ్పీ వైస్ ఛైర్పర్సన్ భీశెట్టి సత్యవతమ్మ, డాక్టర్ విష్ణుమూర్తి, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, జడ్పీటీసీ కో ఆప్షన్ మెంబెర్ జోసెఫ్ , మళ్ల బుల్లిబాబు, కశింకోట మండల పార్టీ అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.