Best Web Hosting Provider In India 2024
.jpg)
తాడేపల్లి: గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని, జీఐఎస్ వేదికగా ఇంధన రంగంలో రూ.9.57 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చే 42 అవగాహన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులతో దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని చెప్పారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వం పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కల్పించిందన్నారు. విశాఖలో రెండురోజులు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (జీఐఎస్) విజయవంతమవడంతోపాటు, పెట్టుబడులను ఆకర్షించడంలో ఇంధనరంగం ప్రథమస్థానంలో నిలిచిన సందర్భంగా ఇంధనశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దేశంలో అగ్రశ్రేణి కంపెనీలైన రిలయన్స్ ఇండియా లిమిటెడ్, అదానీ గ్రీన్ వంటివి ఏపీలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను స్థాపించడానికి ముందుకొచ్చాయని, తద్వారా దాదాపు 1.8 లక్షల ఉపాధి అవకాశాలు రావచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోందని, ఈ పెట్టుబడులు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని వేగంగా పెంచడానికి సహాయపడతాయని చెప్పారు.