Karimnagar Protests : కేంద్ర బడ్జెట్ పై భగ్గుమన్న విపక్షాలు- బీజేపీ ఎంపీల రాజీనామాకు డిమాండ్

Best Web Hosting Provider In India 2024

Karimnagar Protests : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ దుమారం రేపుతోంది. బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ లో వివక్షతకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. 2047 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు.

కరీంనగర్ లో కమ్యూనిస్టుల నిరసన ఆందోళన

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కరీంనగర్ లో కమ్యూనిస్టులు ఆందోళనకు దిగారు. కమాన్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ పై పునఃసమీక్షించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హెచ్చరించారు.

విమర్శలు వద్దు.. వాస్తవాలు గ్రహించండి- బండి సంజయ్

తెలంగాణకు మొండి చేయి చూపారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలు, నిరసనలు అర్ధరహితమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హెూదా ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పొందుపర్చిన యూపీఏ సర్కార్, వంతపాడిన కేసీఆర్ లు… తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హెూదా ఇవ్వాలనే అంశాన్ని ఎందుకు ఆ చట్టంలో ప్రస్తావించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు మీడియా ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హెూదా కోసం కనీస ప్రయత్నం చేయలేదన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కూడా ఉద్దేశపూర్వకంగానే సమర్పించలేదని విమర్శించారు. జాతీయ హెూదా గురించి మాట్లాడేది వాళ్లా?..వరంగల్ లో టెక్స్ టైల్ పార్కును ఏనాడో ప్రకటించడంతోపాటు నిధులు కేటాయించిన తరువాత మళ్లీ దీనిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో భాగంగా తెలంగాణలోని 210 కి.మీల భాగం ఉందని, అందులో కేసీఆర్ దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా పరిధి ఎక్కువగా ఉన్న సోయి కూడా ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లుందన్నారు. రైల్వే వోరాలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసిన సంగతిని మర్చి కోచ్ ఫ్యాక్టరీని ప్రస్తావించడం సిగ్గు చేటు అన్నారు. ఇవేకాదు… తెలంగాణలో రైల్వే, రోడ్ల నిర్మాణాలతోపాటు ఇతర రంగాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చిందని, వివిధ శాఖల వారీగా బడ్జెట్ పూర్తి కేటాయింపుల తరువాత వాస్తవాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు. అబద్దాలు, దొంగ హామీలతో పబ్బం గడపాలనుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పిన సంగతిని మర్చిపోయి కేంద్రంపై విషంకక్కడం ఆ పార్టీల దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని, తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర సహకారంపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTelangana BjpBudget 2024KarimnagarBrs
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024