Best Web Hosting Provider In India 2024
Dy Pawan kalyan: ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ముగిశాయి. జిల్లా కలెక్టర్లు మొదలు, శాఖల బాధ్యతల కేటాయింపు దాదాపు కొలిక్కి వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తూనే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అవినీతి అక్రమాలను వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు శాఖాధిపతులు, అధికారుల నుంచి అందుతున్న అరకొర సమాధానాలపై డిప్యూటీ సిఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణమైనట్టు తెలుస్తోంది. అధికారుల తీరుకు నిరసనగానే బుధవారం సాయంత్రం సచివాలయంలో 5వ బ్లాక్‌లో జరిగిన మంత్రులు, హెచ్‌ఓడిల సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజుల క్రితం ప్రారంభం అయ్యాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది. రెండో రోజు నుంచి సభలో ప్రశ్నోత్తరాలకు సంబంధిత శాఖల మంత్రలుు సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, పంచాయితీరాజ్ శాఖ తరపున ఇచ్చిన సమాధానంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అరకొరగా, అర్థం లేకుండా సమాధానాలు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మండలి సభ్యులు తిరుపతి నాయుడు, కేఎస్ లక్ష్మణరావు,పంచుమర్తి అనురాధ, రామారావులు మంగళవారం పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్‌లో నిధుల మళ్లింపు అంశపై ప్రశ్నించారు. గత ఐదేళ్లలలో గ్రామ పంచాయితీ నిధులు మళ్లించారా?, దాదాపు రూ.9వేల కోట్ల మేరకు నిధులు మళ్లించడంలో నిజం ఎంత? 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎంత పెండింగ్‌లో ఉన్నాయని, పంచాయితీలలో సర్పంచులకు ఉన్న అధికారాలు, గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణలో బాధ్యతలు వంటి అంశాలను సభ్యులు లేవనెత్తారు.
ఈ ప్రశ్నలకు పంచాయితీరాజ్ శాఖ నుంచి అరకొర సమాధానాలు వచ్చాయి. నిధులు మళ్లించారా అంటే అవునని, 15వ ఫైనాన్స్ కమిషన్‌లో కొంత నిధులు బకాయి ఉన్నారని అస్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. దీంతో సభ్యులు అనుబంధ ప్రశ్నలు లేవనెత్తారు.
సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సరైన సమాధానం రాకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయంలోనే పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంపూర్తిగా సమాధానం ఇవ్వడంపై అసంతృప్తి చేస్తూ అధికారులు రాసిచ్చిన ప్రశ్న, వారు సభ్యులకు ఇచ్చిన సమాధానం సభలో చదివి వినిపించారు.
బుధవారం మంత్రి డోలా బాలవీరాంజనేయులుకు కూడా ఇదే రకమైన సమస్య ఎదురైంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై డోలా బాల వీరాంజనేయులు కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ విరామ సమయంలో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో అధికారుల తీరును తప్పు పట్టినట్టు తెలుస్తోంది.
ఏపీలో ప్రభుత్వం మారినా కొందరు అధికారులు వైసీపీ వైపే ఉన్నారనే ఆగ్రహం పలువురు మంత్రుల్లో ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉంటుంది. ప్రభుత్వం చెబితేనే విధానపరమైన నిర్ణయాలను అమలు చేశారు కాబట్టి ఆ నిధులు ఎందుకు మళ్లించారో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయితీరాజ్ నిధుల మళ్లింపు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం సచివాలయంలో అందుబాటులోనే ఉన్నా ఉన్నతాధికారుల సమీక్షకు హాజరు కాలేదు. అధికారుల తీరుకు నిరసనగానే ఆయన సభకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయితీ నిధులు మళ్లింపు, బకాయిలపై పూర్తి సమాచారాన్ని గురువారం సాయంత్రంలోగా అందించాలని సంబంధిత శాఖ అధికారులకు పవన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పంచాయితీ రాజ్ శాఖ నుంచి ఇతర శాఖలకు నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం తనకు అందించాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
బుధవారం సచివాలయంలో సమీక్ష జరుగుతున్న సమయంలో మంగళగిరి నివాసంలో పవన్ కళ్యాణ్ ఆస్ట్రేలియా హైకమిషనర్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనలతో సమావేశమయ్యారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడానికే సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
టాపిక్