
Best Web Hosting Provider In India 2024

Godavari Flood Updates : భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం దోబూచులాడుతోంది. శాంతించినట్లే శాంతించి మళ్లీ పెరుగుతూ భయపెడుతోంది. సోమవారం మధ్యాహ్నం 2.04 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
క్రమేపీ పెరుగుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు 51.60 అడుగులకు పెరిగిన గోదావరి 11 గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం తెల్లవారుజాము 3.51 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు 45.2 అడుగుల మేర గోదావరి నిలకడగా ప్రవహించింది.
గురువారం ఉదయం 11 గంటల నుంచి మళ్ళీ పెరుగుతూ వస్తుంది. 12 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ మూడు రోజుల వ్యవధిలో మరో మారు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు 48.1 అడుగులకు చేరుకున్న వరద ప్రవాహం సాయంత్రం 4 గంటలకు 48.5 అడుగులకు చేరుకుంది. గురువారం రాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 50 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ఆదికారులు పేర్కొన్నారు.
మళ్ళీ గోదావరి పెరగడంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల గుండెల్లో మళ్లీ వణుకు మొదలైంది. సహాయక చర్యల కోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను, క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించారు.
రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
టాపిక్