
Best Web Hosting Provider In India 2024

Irreguler Periods: కొంతమంది అమ్మాయిలకు పెళ్లి అయ్యేవరకు పీరియడ్స్ ప్రతినెలా క్రమంగా వస్తాయి. కానీ వివాహమయ్యాక మాత్రం కొందరికి క్రమ రహితంగా మారిపోతాయి. ఒక నెల పీరియడ్స్ వస్తే, మరో నెల రాకుండా ఉంటాయి. ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిపై ప్రతి అమ్మాయి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
క్రమరహిత పీరియడ్స్ అంటే
సాధారణంగా ఒక మహిళ రుతు చక్రం 21 రోజుల నుండి 35 రోజులు మధ్య ఉంటుంది. అంటే ఒక మహిళకు నెలసరి 21 రోజులు తర్వాత రావచ్చు లేదా 35 రోజుల తర్వాత కూడా రావచ్చు. మూడు నుండి ఏడు రోజుల వరకు వారికి రక్తస్రావం అవుతుంది. అయితే కొంతమందిలో రెండు మూడు నెలలైనా కూడా ఒక్కోసారి నెలసరి రాదు. అదే క్రమ రహిత పీరియడ్స్ అంటారు. అయితే పెళ్లి తర్వాత పీరియడ్స్ క్రమరహితం కావడానికి మాత్రం కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని గైనకాలజిస్టులు వివరిస్తున్నారు.
వివాహం అయ్యాక జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది భావోద్వేగాలను, ఒత్తిడిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఒత్తిడి హార్మోను కార్టిసాల్ విడుదల ఎక్కువవుతుంది. ఇది ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ వంటి పునరుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కూడా క్రమరహిత పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది.
శారీరక శ్రమలో మార్పులు
పెళ్లి కాకముందు ఎక్కువ పని ఉండడం లేదా తక్కువ పని ఉండడం జరగొచ్చు. పెళ్లయిన తర్వాత ఆ పనిలో మార్పులు రావచ్చు. శారీరక శ్రమ స్థాయిలలో పెరుగుదల లేదా తగ్గుదల ఏది వచ్చినా కూడా రుతుక్రమం విపరీతంగా ప్రభావితం అవుతుంది. తీవ్రమైన శారీరక శ్రమ వల్ల శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. ఇది హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అలాగే నిశ్చల జీవనశైలి కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను పెంచుతుంది. వీటి వల్ల కూడా పీరియడ్స్ సరిగా రావు.
ఆహారంలో మార్పులు
ఊరు మారినా, వాతావరణం మారినా… ఆహారంలో మార్పులు కలుగుతాయి. అంతవరకు ఒకేలాంటి ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నవారు, పెళ్లయిన తర్వాత కొత్త ఆహారపు అలవాట్ల నేర్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు శుద్ధి చేసిన పంచదార, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్‌ను కూడా ఎక్కువగా తినాల్సి రావచ్చు. వీటివల్ల కూడా హార్మోన్ అసమతుల్యత ఏర్పడి హార్మోన్ ఉత్పత్తులకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల కూడా క్రమరహిత పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది.
పెళ్లయిన తర్వాత ఎంతో మంది స్త్రీలు గర్భనిరోధక పద్ధతులను ప్రారంభిస్తారు. కొంతమంది జనన నియంత్రణ మాత్రలు వాడడం, కాపర్ టీ వంటి ఇంప్లాంట్లను వాడడం చేస్తారు. ఇది గర్భధారణను విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ సహజంగా హార్మోన్ల సమతుల్యతను మారుస్తాయి. ఇవి కూడా క్రమ రహిత పీరియడ్స్ కు కారణం అవుతాయి.
నిద్ర వల్ల కూడా…
పెళ్లయిన తర్వాత నిద్రలో కొన్ని మార్పులు వస్తాయి. నిద్రా నాణ్యత హార్మోన్ల స్థాయిలను కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే నిద్ర తగ్గడమో లేదా పెరగడమో జరుగుతుందో ఇది రుతుక్రమాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాత్రి 6 గంటలకంటే తక్కువ నిద్రపోయే వారిలో పీరియడ్స్ క్రమరహితంగా మారుతాయి అని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
క్రమరహిత పీరియడ్స్ రాకుండా ఉండాలంటూ పెళ్లయిన తర్వాత కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లనే కొనసాగించాలి. అలాగే యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. బరువు అధికంగా పెరగడం లేదా అధికంగా తగ్గడం వంటివి చేయకూడదు. ఇవి హార్మోన్లు అసమతుల్యతకు కారణం అవుతాయి. అలాగే మీరు రుతుక్రమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకోవడం కూడా చాలా ముఖ్యం.