Best Web Hosting Provider In India 2024
టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో, యూట్యూబ్‍లో ట్రోల్స్‌పై కొంతకాలంగా సీరియస్‍గా ఉన్నారు. ట్రోల్స్ చేసిన వారు ఆ వీడియోలను తొలగించాలని ఇటీవలే డెడ్‍లైన్ కూడా పెట్టారు. సినీ సెలెబ్రిటీలను తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు టెర్మినేట్ అయ్యేలా ‘మా’ చర్యలు తీసుకుంది. అయితే, తాజాగా ఈ-మెయిళ్ల రచ్చ మొదలైంది. మంచు కుటుంబానికి చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పేరుతో కొందరికి మెయిల్స్ వెళ్లాయని.. అందుకు సంబంధించిన స్కీన్‍షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి తీవ్రం కావటంతో మంచు విష్ణు టీమ్ స్పందించింది.
అవి ఫేక్ ఈ-మెయిల్స్
కన్నప్ప సినిమా గురించి పాజిటివ్ వీడియోలు క్రియేట్ చేసి పంపాలని, అలా అయితే యూట్యూబ్ ఛానెల్‍పై బ్యాన్ తొలగేలా చేస్తామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పేరుతో ఆ ఈ-మెయిల్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు మంచు విష్ణుపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే, ఆ ఈ-మెయిల్స్ తాము పంపలేదని, అవి ఫేక్ అని మంచు విష్ణు టీమ్ నేడు క్లారిటీ ఇచ్చింది.
తమ పేరుతో ఫేక్ ఈ-మెయిల్స్ పంపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలనేలా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా మంచు విష్ణు టీమ్ ప్రకటించినట్టు తెలుస్తోంది. “24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిళ్లు చక్కర్లు కొడుతున్నాయి. మేం ఆ ఈ-మెయిళ్లను పంపలేదు. వాటిని ఎవరూ పట్టించుకోవద్దని కోరుతున్నాం. మా పేరుతో ఫేక్ ఈ-మెయిల్స్ పంపుతున్న వాళ్లను గుర్తించేందుకు త్వరలోనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం” అని మంచు విష్ణు టీమ్ పేర్కొంది.
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేయడం, ట్రోల్స్ పేరుతో అభ్యంతరంగా వీడియోలు చేయడం సరికాదంటూ ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేశారు మంచు విష్ణు. నటీనటులపై అసభ్యకరంగా మాట్లాడిన వీడియోలను ఒక్క రోజులో తీసేయాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనంతరం కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై స్ట్రైక్ పడేలా చర్యలు తీసుకున్నారు. మరికొన్ని ఛానెళ్లపై కూడా వేటు వేసేందుకు ఆలోచిస్తున్నామని కూడా ఆ తర్వాత వెల్లడించారు.
కన్నప్పలో బిజీ
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో శివుడి భక్తుడు కన్నప్ప పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ లెజెండ్ మోహన్‍లాల్, కన్నడ హీరో శివ రాజ్‍కుమార్ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రానికి క్రేజ్ ఉంది. కన్నప్ప మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏదాది డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ దిశగా విష్ణు కూడా ఇటీవలే హింట్ ఇచ్చారు. కన్నప్ప టీజర్ కూడా ఇటీవలే వచ్చింది. భారీ బడ్జెట్‍తో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు.