Kaloji kalakesthram : రవీంద్రభారతిని మించేలా ‘కాళోజీ కళాక్షేత్రం’ – పనుల పూర్తికి డెడ్​ లైన్ ఫిక్స్..!

Best Web Hosting Provider In India 2024


సాంస్కృతిక ప్రదర్శనలకు నిలయమైన హైదరాబాద్ రవీంద్రభారతిని మించేలా ఓరుగల్లులో కళాక్షేత్రం రెడీ అవుతోంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరున కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, దాదాపు పదేళ్ల నుంచి పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.

 

కాళోజీ జయంతి, వర్థంతి కార్యక్రమాల సందర్భంగా గత పాలకులు కళాక్షేత్రాన్ని సందర్శించడం, ఆ తరువాత పనులు పూర్తి చేస్తామంటూ హామీలు ఇవ్వడం తప్ప.. పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఓరుగల్లు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, కాంగ్రెస్​ ప్రభుత్వం జనాల్లో మెప్పు సాధించేలా కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై ఫోకస్​ పెట్టింది. ఈ మేరకు వచ్చే సెప్టెంబర్​ 9న కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పనులన్నీ ఆగస్టు 15 వరకే పూర్తి చేయాలని డెడ్​ లైన్​ పెట్టింది. దీంతో అధికారులు ఓరుగల్లు రవీంద్ర భారతి కాళోజీ కళాక్షేత్రం పనులను స్పీడప్​ చేస్తున్నారు.

 

కేసీఆర్​ చేతులమీదుగా శంకుస్థాపన

కళలకు పుట్టినిల్లుగా చెప్పుకునే ఓరుగల్లు జిల్లాలో కళాకారుల ప్రదర్శనలకు సరైన వేదిక లేకుండా పోయింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 సెప్టెంబర్​ 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా హనుమకొండలో ఆయన పేరున కళాక్షేత్రం నిర్మించేందుకు గత సర్కారు అడుగులు వేసింది. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 9న అప్పటి సీఎం కేసీఆర్ హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో శంకుస్థాపన చేశారు.

 

నాలుగున్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో రవీంద్రభారతిని తలదన్నేలా కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని, ఈ పనులన్నీ ఏడాదిలోగానే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కళలు, సాంస్కృతిక కళా ప్రదర్శలనకే కాకుండా వివాహాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాలకు కూడా ఉపయోగపడేలా, సుమారు రెండు వేల మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మించాలని ఆదేశించారు.

 

ఈ మేరకు మొత్తం నిర్మాణానికి రూ.50 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా వేయగా, అప్పటి సీఎం ఆదేశాలతో కాళోజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి.

 

రవీంద్రభారతికి ధీటుగా ప్లాన్

హైదరాబాద్​లోని రవీంద్రభారతి కంటే మిన్నగా ఉండేలా కాళోజీ కళాక్షేత్రానికి ప్లాన్​ రెడీ చేశారు. జీ ప్లస్ ఫోర్ మోడల్​ బిల్డింగ్ పనులు చేపట్టి, పనులను మూడు దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్​ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు, రెండో దశలో ఇంటీరియర్, ఎలక్ట్రికల్ పనులు, మూడో దశలో ల్యాండ్ స్కేపింగ్, పాథ్​ వే, పార్కింగ్ తదితర పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

 

అంతేగాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో 2 వేల మందికి సరిపడా ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, రిహార్సల్స్ రూం, ఫస్ట్ ఫ్లోర్​ లో ప్రీ ఫంక్షన్స్ వేదిక, ఆఫీస్ రూంలు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, రెండో అంతస్తులో లైబ్రరీ, ఆఫీస్, మూడు, నాలుగో అంతస్తులో ఫంక్షన్స్ హాల్స్, బాల్కనీ, టెర్రాస్, క్యాట్వాక్ లాబీ తదితర ఫెసిలిటీస్​ ఉండేలా అద్భుత ప్లాన్​ తో పనులు మొదలుపెట్టారు.

 

పెండింగ్​ పనులతో పెరిగిన బడ్జెట్

కళాక్షేత్రం నిర్మాణానికి మొదట రూ.50 కోట్లు మంజూరు చేయగా, హైదరాబాద్ కు చెందిన మెస్సర్స్​ సిర్కో అనే సంస్థ టెండర్​ దక్కించుకుంది. ఆ తర్వాత వరంగల్ కు చెందిన లోకల్ కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు అప్పగించింది. ఈ మేరకు పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగుతూ.. సాగుతూ వచ్చాయి. దీంతో నిర్మాణ పనులను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ టేకాఫ్​ చేసింది. కానీ నిర్మాణ పనుల్లో క్వాలిటీ పాటించకపోవడంతో రెండేళ్ల కిందట కొన్నిచోట్ల పిల్లర్లు కుంగిపోయి, బిల్డింగ్ రూఫ్​ కూడా దెబ్బతింది.

 

దీంతో అప్పట్లో కుడా వీసీగా పని చేసిన ప్రావీణ్య దృష్టికి వెళ్లడంతో ఆమె ఆదేశాల మేరకు వరంగల్ ఎన్​ఐటీ ఇంజినీరింగ్​ సిబ్బంది కళాక్షేత్రాన్ని పరిశీలించి, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని రిపోర్ట్​ ఇచ్చారు. కళాక్షేత్రంలో పిల్లర్లు బలంగా ఉండాలంటే రెట్రో ఫిట్టింగ్ తప్పనిసరిగా చేయాలని సూచించారు. దీంతో రూ.50 కోట్ల బడ్జెట్​ ను రూ.70 కోట్లకు పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత డిజైన్లలో మార్పులు, చేర్పుల కోసం మరో రూ.5 కోట్లు కూడా పెంచారు. టార్గెట్ల మీద టార్గెట్లు పెట్టి పనులు చేయించారు. కానీ కాళోజీ కళాక్షేత్రం పనులను మాత్రం పూర్తి చేయించలేకపోయారు.

 

సెప్టెంబర్​ లో ఓపెనింగ్

గత ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పేరున చేపట్టిన కళాక్షేత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదంటూ కాంగ్రెస్​ సర్కారు ముందుగా ఆ పనులపై ఫోకస్​ పెట్టింది. ఈ మేరకు ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు పనులు స్పీడప్​ చేస్తున్నారు. అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేసి, సెప్టెంబర్​ 9న కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని ఓపెనింగ్ చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇతర నేతలు భావిస్తున్నారు.

 

కాగా కాళోజీ జయంతి రోజున సీఎం రేవంత్​ రెడ్డిని ఓరుగల్లుకు తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగానే కళాక్షేత్రాన్ని ఓపెనింగ్ చేయించేందుకు ఇక్కడ ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. మరి డెడ్​ లైన్​ లోగా పనులు పూర్తి చేయించి, అనుకున్న సమయంలో ఓపెనింగ్​ చేయించడంలో కాంగ్రెస్​ నేతలు ఏమేరకు సక్సెస్​ అవుతారో చూడాలి.

 

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

 

WhatsApp channel

టాపిక్

WarangalTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024