Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: విద్య, గృహ నిర్మాణ రంగాలు సామాజిక ఆర్థిక ప్రగతిలో కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకింగ్ రంగం మరింత సానుకూల దృక్పథంతో.. అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. 222వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. గత ఏడాది ఎంత మేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నారు.. ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారో వివరిస్తూ మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందని, ఇది 124.69 శాతంగా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందన్నారు. విద్య, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా రుణాలు తక్కువగా ఉన్నాయన్నారు. విద్యా రంగానికి కేవలం 42.91 శాతం, గృహ నిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని.. సామాజిక–ఆర్థిక ప్రగతిలో ఈ రెండు కీలక రంగాలు అయినందున బ్యాంకింగ్ రంగం వీటి పట్ల మరింత సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలని కోరారు.