Best Web Hosting Provider In India 2024
Allu Arjun: సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ తేలిపోవడానికి కారణం ఏంటి? కొన్నేళ్లుగా బాలీవుడ్ ఎక్కడ వెనుకబడిపోతోంది? ఈ ప్రశ్నలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్లు అక్కడి డైరెక్టర్ నిఖిల్ అద్వానీ వెల్లడించాడు. ఈ మధ్యే గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అల్లు అర్జున్ తో మాట్లాడినప్పటి విషయాలను అతడు పంచుకున్నాడు.
సౌత్ సినిమాలంటే ఇవీ..
బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతుండటానికి కారణం ఏంటి? ఈ పాయింట్ పై అక్కడి డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా కొన్నాళ్ల కిందట తాను అల్లు అర్జున్ తో మాట్లాడుతున్నప్పుడు అతడు చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. బన్నీతో తాను సినిమా చేయాలని అనుకున్నానని, అదే సమయంలో బాలీవుడ్ పై అతని ఆలోచన ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు.
సౌత్ సినిమాలు అంటే చాలా మంది పురాణ, ఇతిహాసాలనే అనుకుంటారని, కానీ సాధారణ పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన హీరోయిజాన్ని చూపిస్తుందని అర్జున్ చెప్పినట్లు నిఖిల్ వెల్లడించాడు. “అతడు ఏమన్నాడంటే.. ప్రతి ఒక్కరూ సౌత్ సినిమా అంటే మైథాలజీ అనుకుంటారు. కానీ వాళ్లు ఓ సాధారణ భావోద్వేగాన్ని తీసుకుంటారు. అంటే సాగునీటి కాలువల పరిస్థితి వంటివి. వాటిపై సినిమాలు చేస్తారు. వాళ్లు దానికి అద్భుతమైన యాక్షన్, అద్భుతమైన హీరోయిజాన్ని జోడించి తీస్తారు అని చెప్పాడు” అని నిఖిల్ తెలిపాడు.
బాలీవుడ్‌లో హీరోయిజం ఎక్కడ?
తాను ఓ సినిమా గురించి మాట్లాడటానికి అల్లు అర్జున్ కలిశానని, అప్పుడు అతడు బాలీవుడ్ హీరోయిజం మరచిపోయిందని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. “నేను అల్లు అర్జున్ ను కలిసినప్పుడు ఓ సినిమా గురించి మాట్లాడాను. అప్పుడతడు నావైపు చూస్తూ.. బాలీవుడ్ వాళ్లు ఏం తప్పు చేస్తున్నారో తెలుసా? మీరు హీరోలు ఎలా కావాలో మరచిపోయారు. అది మైథాలజీ కాదు.. బాలీవుడ్ హీరోయిజాన్ని మరచిపోయింది అని అన్నాడు” అని నిఖిల్ చెప్పడం గమనార్హం.
నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేసిన వేదా మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో జాన్ అబ్రహం, శర్వరి నటించారు. నిజానికి అదే తేదీని అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఆ సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ క్లైమ్యాక్స్ సీన్ ఒకటి ఆన్లైన్లో లీకవడం ఆందోళన కలిగించింది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇక సౌత్ వర్సెస్ నార్త్ చర్చ విషయానికి వస్తే కొన్నేళ్లుగా బాలీవుడ్ వెనుకబడిపోతోంది. అల్లు అర్జున్ నటించిను పుష్ప సహా ఎన్నో సౌత్ సినిమాలు హిందీ బెల్ట్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. గతేడాది షారుక్ నటించిన పఠాన్, జవాన్ తప్ప ఈ మధ్య కాలంలో భారీ వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమా ఒక్కటి కూడా లేదు. అదే సమయంలో సౌత్ సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం, దానికి దగ్గరగా వెళ్లడం చేస్తున్నాయి.
టాపిక్