Best Web Hosting Provider In India 2024
అందరి అభిప్రాయాలు తెలుసుకొని బొత్సను ఎంపిక చేసిన వైయస్ జగన్
తాడేపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా బొత్స సత్యన్నారాయణను పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం అభ్యర్థులపై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న వైయస్.జగన్..అనంతరం బొత్సను ఎంపిక చేశారు.
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం.. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన.. ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
వైయస్ఆర్‌సీపీదే బలం
విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైయస్ఆర్‌సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం మొదలుపెట్టింది. జీవీఎంసీలో 12 మంది వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. అయితే.. కార్పొరేటర్లతో మాట్లాడిన వైయస్ జగన్, రాబోయే రోజులు వైయస్ఆర్‌సీపీవేనని.. అధైర్యపడొద్దని చెప్పారు.
అందరి వాడు..బొత్స సత్యనారాయణ
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అందరివాడిగా పిలుస్తారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా గుర్తింపుపొందాడు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఆయనకు పేరుంది. బొత్స సత్యనారాయణ 7 జూన్ 2015న వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరాడు . 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైయస్ఆర్‌సీపీ తరఫున గెలిచి ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా రెండున్నరేళ్లు, విద్యాశాఖ మంత్రిగా రెండున్నరేళ్లు పని చేశారు. పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి బొత్స సత్యనారాయణ కృషి చేయడంతో ఆయన్ను ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
రాజకీయ జీవితం
బొత్స సత్యనారాయణ 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004, 2009లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, రవాణా మరియు మార్కెటింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు .