Best Web Hosting Provider In India 2024
Nikhat Zareen Lost: మన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పారిస్ ఒలింపిక్స్ లో నిరాశ పరిచింది. ఆమె మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్ లోనే ఓడిపోయింది. గురువారం (ఆగస్ట్ 1) జరిగిన రౌండ్ ఆఫ్ 16 బౌట్ లో చైనా బాక్సర్ వు యు చేతుల్లో 0:5 తేడాతో ఓటమి పాలైంది. తొలి బౌట్ లో జర్మనీ బాక్సర్ పై గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టిన నిఖత్.. ఇక్కడ చైనా బాక్సర్ జోరు ముందు నిలవలేకపోయింది.
ఈసారి ఒలింపిక్స్ లో బాక్సింగ్ నుంచి కచ్చితంగా ఓ మెడల్ తెస్తుందనుకున్న నిఖత్ జరీన్ కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేదు. 50 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16లోనే ఆమె కథ ముగిసింది. మొదటి రౌండ్ నుంచీ చైనా బాక్సర్ వు యు దూకుడుగా కనిపిస్తూ నిఖత్ పై పంచ్ ల వర్షం కురిపించింది. దీంతో తొలి రౌండ్ లో ఐదుగురు జడ్జీల్లో నలుగురు ఆమెకు పర్ఫెక్ట్ 10 స్కోరు ఇవ్వగా.. ఒక్కరు మాత్రం నిఖత్ కు ఇచ్చారు.
ఇక రెండో రౌండ్లోనూ అదే జరిగింది. వు యు దూకుడు ముందు నిఖత్ నిలవలేకపోయింది. ఈసారి ముగ్గురు జడ్జీలు చైనా బాక్సర్ కు పర్ఫెక్ట్ 10 ఇచ్చారు. ఇద్దరు నిఖత్ వైపు నిలిచారు. మూడో రౌండ్లో కూడా నిఖత్ కోలుకోలేకపోయింది. దీంతో మూడు రౌండ్లు ముగిసే సమయానికి ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా చైనా బాక్సర్ వు యుని విజేతగా అనౌన్స్ చేశారు.
హాకీలోనూ తప్పని ఓటమి
అటు హాకీలోనూ ఇండియాకు ఓటమి తప్పలేదు. బెల్జియంతో జరిగిన మ్యాచ్ లో ఇండియా 1-2 తేడాతో ఓడిపోయింది. నిజానికి ఫస్ట్ హాఫ్ లో ఇండియానే 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో క్వార్టర్ లో కోలుకున్న బెల్జియం రెండు గోల్స్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత స్కోరు సమం చేయడానికి ఇండియా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఇండియా తరఫున 18వ నిమిషంలో అభిషేక్ గోల్ చేశాడు. బెల్జియం 33, 44వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన బెల్జియం.. పూల్ స్టేజ్ లో నాలిగింటికి నాలుగు మ్యాచ్ లు గెలిచింది. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. ఇండియా ఇప్పటి వరకూ 4 మ్యాచ్ లు ఆడి 2 గెలిచి, ఒకటి ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. 7 పాయింట్లతో పూల్ బిలో రెండో స్థానంలో ఉంది. బెల్జియం 4 మ్యాచ్ లలోనూ గెలిచి 12 పాయింట్లతో టాప్ లో ఉంది.