GO 317 Problems : స్థానికతపై 2 ప్రతిపాదనలు…! తుది నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు

Best Web Hosting Provider In India 2024

Telangana Govt GO 317 : జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్‌ సబ్ కమిటీ వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. శనివారం హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ  అధ్యక్షతన సమావేశం అయింది. కమిటీ సభ్యుడిగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఇందులో పాల్గొన్నారు.

 

ఈ సమావేశంలో 317 జీవో పై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాదించింది. అయితే సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదించిన అంశాలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో సంప్రదించాలని సూచించింది. ఆ తర్వాత తుది నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది.

అదేవిధంగా జీవో 46 కు సంబంధించిన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం న్యాయ నిపుణులతో చర్చించింది. సాధ్యమైనంత త్వరగా జీవో 317 సమస్యలను పరిష్కారించాలనే ఉద్దేశ్యంతో సబ్ కమిటీ పని చేస్తోంది. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, శివశంకర్ (రిటైర్డ్ ఐఎయస్ ), బుసాని వెంకటేశ్వరరావు (రిటైర్డ్ ఐఏఎస్) క్యాబినెట్ సబ్ కమిటీ కన్సల్టెంట్, జాయింట్ సెక్రెటరీ సర్వీసెస్, జి సునీత దేవి, సహాయ కార్యదర్శి మల్లికార్జున్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

317 జీవో వివాదం…!

గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవోను తీసుకొచ్చింది. రాష్ట్రంలో కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటంతో.. కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు.. ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియను నాటి ప్రభుత్వం ప్రారంభించింది. 2021 డిసెంబర్ 6వ తేదీన ఈ జీఓను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు.. ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది.

 

ఈ ఆప్షన్లకు ఆ కేడర్ పోస్టులో సీనియారిటీని ప్రధాన ప్రాతిపదికగా నిర్ణయించింది. వికలాంగులతో పాచు పలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత కింద ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును కల్పించింది. అయితే మల్టీ జోనల్, జోనల్ కేడర్ పోస్టుల్లో కన్నా జిల్లా కేడర్ ఉద్యోగుల సర్దుబాటుపై ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమమయ్యాయి.

ఈ నేపథ్యంలో జీఓ 317ను వ్యతిరేకిస్తూ డిసెంబర్ చివరి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.ఉద్యోగుల స్థానికతను 317 జీఓ పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రధానంగా ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా పని చేయాల్సిన తమను వేరే జిల్లాలకు బదిలీ చేస్తున్నారని చెబుతున్నారు. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు.. చాలా శాఖల్లోని ఉద్యోగస్తులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గం ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ్మ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు కాగా… జీవో 317 సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. వారంలో ఒక్కసారైనా సమావేశం అవుతూ… త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది.

WhatsApp channel
 

టాపిక్

 
Telangana NewsGovernment Employees
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024