Best Web Hosting Provider In India 2024
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. తెలుగమ్మాయి, భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ.. ఒలింపిక్ క్రీడల్లో అద్బుత ప్రదర్శన కొనసాగించారు. తన పుట్టిన రోజైన నేడు (జూలై 31) జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల రౌండ్ 32 మ్యాచ్‍లో అదరగొట్టారు. ఈ రౌండ్‍లో విజయం సాధించి ప్రీ-క్వార్టర్స్ చేరారు. ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ చేసిన రెండో భారత ప్లేయర్‌గా శ్రీజ చరిత్ర సృష్టించారు. ఇటీవలే మనికా బాత్రా ఈ రికార్డు నెలకొల్పగా.. ఆమెనే ఫాలో అయ్యారు శ్రీజ.
తొలి గేమ్ పోయినా..
నేడు జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ మ్యాచ్‍లో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో సింగపూర్ ప్లేయర్ జియాన్ జెంగ్‍పై విజయం సాధించారు. 4-2తో ఆధిపత్యంతో గెలిచారు. 9-11తో తొలి గేమ్ కోల్పోయినా ఆ తర్వాత శ్రీజ కమ్‍బ్యాక్ ఇచ్చారు. అద్భుత ప్రదర్శన కనబరిచారు. తన మార్క్ షాట్లతో దూకుడుగా ఆడారు. దీంతో జియాన్ మళ్లీ పుంజుకోలేకపోయారు. రెండో గేమ్‍ను కాస్త శ్రమించి గెలిచిన శ్రీజ.. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడారు.
మూడు, నాలుగు గేమ్‍ల్లో శ్రీజకు తిరుగే లేకుండా పోయింది. 11-4, 11-5 తేడాతో గెలిచారు. అయితే ఐదో గేమ్‍ను 10-12తో కోల్పోయారు. అయితే, మళ్లీ పుంజుకొని ఆరో గేమ్‍ను 12-10తో శ్రీజ కైవసం చేసుకున్నారు. దీంతో 4-2తో మ్యాచ్ గెలిచి.. తనకు తానే పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్స్ చేరారు.
సింధు కూడా ముందడుగు
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవి సింధు కూడా పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రీ-క్వార్టర్స్ చేరారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన సింధు.. ఇప్పుడు పారిస్‍లో అదరగొట్టి హ్యాట్రిక్ మెడల్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో నేడు (జూలై 31) జరిగిన బ్యాడ్మింటన్ గ్రూప్-ఎం మహిళల సింగిల్స్ 32 రౌండ్‍లో సింధు 21-5, 21-10తో ఇస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కుబాపై అలవోకగా గెలిచారు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపి విజయం సాధించారు సింధు. ప్రీ-క్వార్టర్ మ్యాచ్‍లో చైనా ప్లేయర్ హె బింగ్‍జియావోతో పీవీ సింధు తలపడనున్నారు.
లక్ష్య సూపర్ విక్టరీ
భారత యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ దుమ్మురేపాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల సింగిల్స్ రౌండ్ 32 మ్యాచ్‍లో అద్భుత ఆట తీరుతో విజయం సాధించాడు. నేడు జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్‍లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జోనాథన్ క్రిస్టీని 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో 22 ఏళ్ల లక్ష్యసేన్ ఓడించాడు. తొలి గేమ్‍లో ఓ దశలో 2-8తో వెనుకబడినా ఆ తర్వాత లక్ష్య విజృభించాడు. దూకుడుగా ఆడాడు. దీంతో 11-10తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. క్రిస్టి ప్రతిఘటించినా లక్ష్య దుమ్మురేపాడు. తొలి గేమ్ సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‍లో పూర్తి ఆధిపత్యం చూపాడు లక్ష్య. దీంతో పారిస్ ఒలింపిక్స్ ప్రీ-క్వార్టర్స్ చేరాడు.