World Breastfeeding week: చనుమొన నొప్పి నుంచి కూర్చునే స్థితి దాకా.. పాలిచ్చే తల్లులు చేసే తప్పులివే

Best Web Hosting Provider In India 2024

పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి తల్లిపాలు చాలా కీలకం. కానీ సరైన అవగాహన లేకపోతే పిల్లలకు పాలుపట్టడం కష్టంగా అనిపిస్తుంది. లేనిపోని అనారోగ్య సమస్యలూ రావచ్చు. పిల్లలకు పాలిచ్చేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 దాకా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలుగా పరిగణిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో తల్లిపాలు పట్టేటప్పుడు చేయకూడని తప్పులేంటో తెల్సుకోండి.

కూర్చునే విధానం:

శిశువుకు పాలిచ్చేటప్పుడు చాలా మంది కిందికి వంగుతుంటారు. ఇలా దీర్ఘకాలం కొనసాగితే నడుమునొప్పి రావచ్చు. అందుకే మీరు వంగడానికి బదులు పాప తలకింద మీ చేతు ఆసరాగా ఇచ్చి, పాప తలను పైకి తెచ్చుకోవాలి. ఇలా చాలా సేపు పట్టుకుని పాలివ్వడం మీకు ఇబ్బంది అనిపిస్తే ఫీడింగ్ పిల్లో వాడొచ్చు. దీనివల్ల సమస్య తగ్గుతుంది. లేదా మామూలు తలగడలను మీ తొడమీద పెట్టుకుని, వాటి మీద పాపను పడుకోబెట్టి పాలు పట్టాలి. అలాగే దేనికైనా ఆనుకుని కూర్చోవడం మర్చిపోవద్దు. బెడ్ లేదా కుర్చీలో కూర్చుని పాలిస్తున్నప్పుడు వెనకాల తలగడ పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది.

పాప భంగిమ:

పాపను వెల్లకిలా పడుకోబెట్టి, తల మాత్రం మీ వైపు తిప్పి పాలు పట్టడం సరికాదు. పాప ఛాతీ మీ వైపు ఉండటం మంచిది. మీరు పడుకుని పాలిస్తున్నట్లయితే కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలి. పాపను పూర్తిగా మీవైపు తిప్పుకుని పాలివ్వాలి. పాప శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పడుకుని పాలిస్తున్నప్పుడు మీరు నిద్రపోకుండా ఉండాలి. పాప పాలు తాగడాన్ని గమనిస్తుండాలి.

పాలు పట్టే విధానం:

పాలిచ్చేటప్పుడు చాలా మంది చేసే తప్పు.. పాప నోట్లో కేవలం చనుమొన మాత్రమే ఉంచడం. దాని వల్ల పాలు సరిగ్గా తాగలేరు. చనుమొన చుట్టూ ముదురు రంగులో ఉండే చర్మం.. అంటే ఎరియోల భాగం కూడా పాప నోట్లో ఉండేలా చూసుకోవాలి. దానివల్ల పాలు కూడా సులువుగా తాగగలుగుతారు. అలాగే పాప గడ్డం భాగం (Chin) మీ రొమ్ము కింది భాగానికి ఆనుకొని ఉండాలి. దీనివల్ల పాలు సులువుగా తాగగలుగుతారు.

చనుమొనలో నొప్పి:

పాలు పట్టేటప్పుడు చనుమొనలో నొప్పి రావడం సాధారణం అనుకుని పట్టించుకోరు. అది పూర్తిగా తప్పు. ఏదైనా సమస్య ఉంటేనే నొప్పి వస్తోందని గమనించాలి. పాలు పట్టే విధానంలో ఏదైనా పొరపాట్లు, చనుమొనలు పొడి బారడం, పుండు లాగా అవ్వడం (sore nipples), తగినన్ని పాలు లేకపోవడం లాంటివి కారణాలు కావచ్చు. ఎక్కువ రోజులు సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. పాలు పట్టడం మొదలుపెట్టిన రోజుల్లో సమస్య ఉండొచ్చేమో కానీ దీర్ఘకాలం కొనసాగితే సమస్య ఉన్నట్లే.

ఫార్ములా పాలు..:

పాప ఏడవడానికి కారణం అన్నిసార్లు పాలు సరిపోకపోవడమే కాదు. అలా అనుకోవడం వల్ల అవసరం లేనప్పుడు కూడా పాపకు ఫార్ములా పాలు పట్టడం మొదలు పెట్టేస్తారు. బదులుగా పాల ఉత్పత్తిని సహజంగానే పెంచే ఆహారాలు తినడం మొదలుపెట్టాలి. వైద్యుల్ని సంప్రదించి అసలు కారణం కనుక్కోవాలి. అవసరం లేనప్పుడు ఫార్ములా పాలు పట్టడం వల్ల పాపకు తల్లిపాలు తక్కువగా పట్టిస్తాం. దానివల్ల నిజంగానే పాల ఉత్పత్తి తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి.

 

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024