Best Web Hosting Provider In India 2024
Paris Olympics Day 5 India Schedule: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా ఇప్పటికే రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. రెండో రోజు, నాలుగో రోజు మను బాకర్ ఈ మెడల్స్ అందించింది. అయితే బుధవారం (జులై 31) ఐదో రోజు ఇండియా ఖాతాలో మరో మెడల్ చేరే అవకాశం లేదు. ఎందుకంటే మన అథ్లెట్లు ఎలాంటి మెడల్ ఈవెంట్లలోనూ పాల్గనడంలేదు.
ఐదో రోజు చూడాల్సిన ఐదు ఈవెంట్లు ఇవే
బ్యాడ్మింటన్ – మధ్యాహ్నం 12:50 గంటల నుంచి
పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్.. మహిళల సింగిల్స్ లో పీవీ సింధు తమ తమ గ్రూపుల చివరి మ్యాచ్ లను ఆడనున్నారు. ఈ మ్యాచ్ లలో గెలిస్తే ఈ ముగ్గురూ రౌండ్ ఆఫ్ 16లో చేరుతారు. వారి మ్యాచ్ లు వర్చువల్ రౌండ్ ఆఫ్ 32 పోటీలుగా మారుతాయి.
సింధు, ప్రణయ్ చాలా తక్కువ ర్యాంక్ ప్రత్యర్థులతో తలపడనుండగా.. లక్ష్యసేన్ ప్రస్తుత ఆసియా, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)తో గట్టి పరీక్షను ఎదుర్కోనున్నాడు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారు. పురుషుల డబుల్స్ నాకౌట్ డ్రాలను కూడా బుధవారం (జులై 31) ప్రకటించనున్నారు.
బాక్సింగ్ – మధ్యాహ్నం 3:50 గంటల నుంచి
ఒలింపిక్స్ లో పతకం సాధించిన ముగ్గురు భారత బాక్సర్లలో ఒకరైన లవ్లీనా బొర్గోహైన్ బుధవారం(జులై 31) పారిస్ ఒలింపిక్స్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా మహిళల 75 కేజీల రౌండ్ ఆఫ్ 16లో నార్వే బాక్సర్ సున్నీవా హాఫ్స్టాడ్ తో తలపడనుంది.
గత ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో లవ్లీనా స్వర్ణం గెలుచుకోగా, రెండేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో సున్నీవా స్వర్ణం సాధించింది. పురుషుల 71 కేజీల రౌండ్ ఆఫ్ 16లో ఈక్వెడార్ కు చెందిన జోస్ గాబ్రియేల్ రోడ్రిగ్జ్ టెనోరియోతో తలపడనున్నాడు నిశాంత్ దేవ్.
ఆర్చరీ – మధ్యాహ్నం 3:56 గంటల నుంచి
భారత ఆర్చరీ జట్లు క్వార్టర్ ఫైనల్స్ దాటి ముందుకు వెళ్లలేకపోయినప్పటికీ, వ్యక్తిగత ఈవెంట్లలో రాణించాలని ఆర్చర్లు ఎదురు చూస్తున్నారు. భజన్ కౌర్ మంగళవారం రౌండ్ ఆఫ్ 16కు చేరుకోవడం ద్వారా శుభారంభం చేసింది. అయితే బుధవారం మహిళల రౌండ్ ఆఫ్ 64లో మాజీ ప్రపంచ నంబర్ వన్ దీపికా కుమారి ఎస్టోనియన్ రీనా పర్నత్ తో తలపడనుంది. ఆమె గెలిస్తే బుధవారం జరిగే రౌండ్ ఆఫ్ 32లో కూడా ఆడుతుంది. పురుషుల రౌండ్ ఆఫ్ 64లో బ్రిటన్ ఆటగాడు టామ్ గాల్ తో తరుణ్ దీప్ రాయ్ తలపడనున్నాడు.
ఫుట్ బాల్ – రాత్రి 8:30 గంటల నుంచి
గ్రూప్ దశల్లో ఉన్నప్పటికీ మహిళల ఫుట్‌బాల్ ఆసక్తి రేపుతోంది. నాలుగు సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కెనడా కూడా కొలంబియాతో, రియో 2016 ఛాంపియన్ జర్మనీ.. జాంబియాతో తలపడనున్నాయి.
ట్రయథ్లాన్ – ఉదయం 11.30 గంటల నుంచి
పురుషుల, మహిళల ట్రయాథ్లాన్ పోటీలు పాంట్ అలెగ్జాండర్ 3లో జరుగుతాయి. గత ఎడిషన్ పురుషుల ఛాంపియన్ క్రిస్టియన్ బ్లూమెన్ఫెల్ట్ (నార్వే) తన టైటిల్ ను డిఫెండ్ చేసుకోవడానికి పోటీపడనున్నాడు. టోక్యో 2020 మహిళల స్వర్ణ పతక విజేత బెర్ముడాకు చెందిన ఫ్లోరా డఫీ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగబోతోంది.