Monday motivation: అందంగా లేమని ఆత్మస్థైర్యం కోల్పోతున్నారా? అందమంటే అది కాదు..

Best Web Hosting Provider In India 2024

అప్పుడే పుట్టిన పసికందు అందానికి కూడా వంకలు పెట్టే మనసులు, మనుషులు మన చుట్టూ ఉంటారు. ముక్కు బాలేదని, రంగు తక్కువనీ, జుట్టు లేదనీ, పొట్టనీ, పొడువనీ.. ఒకరిని మించి ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఆ చెప్పేవాళ్లలో మనమూ ఉంటాం. తర్వాత మనమే అందం గురించి బాధపడతాం. అందంగా లేమని నలుగురిలో తిరగడానికీ, వేడుకలకు వెళ్లడానికీ, పెళ్లి చేసుకోడానికీ, అందరితో మాట కలపడానికీ.. జంకే వారు బోలెడుమంది. ఆ బావనతో ఆత్మస్థైర్యం కోల్పోతారు. అమ్మాయిలకే కాదూ అబ్బాయిలకూ ఈ లోలోపల భయాలు ఉంటాయి. ఎవరూ మినహాయింపు కాదిక్కడ. కానీ అందానికి తప్పుడు నిర్వచనం ఇచ్చే ఒక సమాజాన్ని సృష్టించేది మనమే.

 

ఎవరికి ఏం అవసరమో అది వాళ్ల దగ్గర ఉంటుంది. ఒకరు అందంతోనే వాళ్ల జీవితాన్ని మార్చుకోగలరు. కొందరు తెలివితేటలతో అందమైన జీవితాన్ని నిర్మించుకోగలరు. అందం ఒక్కటే జీవితంలో ముఖ్యం అనుకుంటే సినీ నటులు మాత్రమే పుస్తకాల్లో, చరిత్రల్లో ఉండేవాళ్లు. విజయాలు కేవలం వాళ్లే సాధించేవారు. కాబట్టి మీ దగ్గర ప్రత్యేకంగా ఏదో ఒక గుణం ఉంటుంది. దానికి పదును పెడితే అత్యంత అందంగా ఉన్న మనుషులు కూడా మీ వెనకే ఉంటారు. మీకు గౌరవం ఇస్తారు.

నెమలికి నాట్యం అందం

కోకిలకు గానం అందం

కాకికి నలుపు అందం

హంసకు తెలుపు అందం

సెలయేరుకు గలగల అందం

సముద్రానికి శాంతం అందం

అడవికి పచ్చదనం అందం

ఎడారికి ఇసుక అందం

చంద్రునికి వెన్నెల అందం

సూర్యునికి మండే భగభగ సెగలే అందం

కాబట్టి ఎవరి సుగుణాలు వాళ్లకుంటాయి. కోకిల నాట్యం చేయలేదు. నెమలి కోకిలలాగా వినసొంపుగా కూయలేదు. ఇసుక అడవిలో ఉంటే విలువ లేదు. ఎడారిలో చెట్టు బ్రతకలేదు. కాబట్టి ప్రతి మనిషి తనకున్న మంచి గుణాల్ని గుర్తించి వాటికి పదును పెట్టాలి కానీ, వాళ్లకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదు.

ఓ అడవి పక్క పల్లెలో కాకి ఉండేది. అది మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలో కొలనులో హంసని చూసి… ‘తెల్లగా ఎంత అందంగా ఉందీ హంస. దీనంత సంతోషంగా మరే పక్షీ ఉండదు. నేనూ ఉన్నాను ఎందుకు?!’ అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. ‘నేనూ అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపూ, ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక!’ అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి… హంస అన్నీ మాటల్ని చెప్పింది. ‘అవును హంస చెప్పి నట్లూ నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు రెండు రంగులే ఉన్నాయి. నెమలికి ఎన్ని రంగులో…! అంది అసూయగా..

 

వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి, అడవంతా తిరిగింది. కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దానివద్దకెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే. మనుషులకీ నువ్వంటే ఎంతిష్టమో!’ అంటూ పొగిడింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీనయ్యాను. అడవిలో ఉన్నంత వరకూ వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక ‘కాకి కంటే స్వేచ్ఛా జీవి మరొకటి లేదు కదా!’ అనిపిస్తోంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్నీ బందీలుగా పెట్టారు… ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్చగా తిరిగేదాన్ని కదా!” అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచీ మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.

కాబట్టి ఎవరికి కావాల్సిన లక్షణాలు వాళ్లకు వరంగా ఉంటాయి. వాటిని గౌరవించి, విలువ తెల్సుకుని ముందుకు కదలాలి తప్ప. ఒకరితో పోల్చుకుని ఆత్మస్థైర్యం కోల్పోకూడదు.

 

 
WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024