Vemulawada: వేములవాడ లో శ్రావణ సందడి, బ్రేక్ దర్శనాలకు ఆలయంలో శ్రీకారం చుట్టిన అధికారులు

Best Web Hosting Provider In India 2024

Vemulawada: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శ్రావణమాసం సందడి నెలకొంది. సోమవారం శ్రావణమాసం ప్రారంభంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరస్వామి వారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీతో స్వామివారి గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేశారు.

నెల రోజులపాటు సోమ, శుక్రవారములలో స్వామి, అమ్మవారలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అభిషేకం, సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించారు.‌

శుక్రవారం ప్రత్యేకత..

శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు వేములవాడ ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 19వ తేదీన రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో ఋగ్వేద, యజుర్వేద బ్రాహ్మనోత్తములు ఉపాకర్మ నిర్వహిస్తారు. అలాగే శ్రీకృష్ణాష్టమి, మాస శివరాత్రి, ఆరుద్ర, పునర్వసు, రేవతి నక్షత్రము రోజులలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

చివరి సోమవారం రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం, పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహిస్తారు. తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వేదమంత్రాలతో గావించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేములవాడ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు..

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా బ్రేక్ దర్శనాలకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. ప్రతి రోజూ రెండు సార్లు భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శనాలు ఉంటాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు. బ్రేక్ దర్శనం టికెట్ ఒక్కరికి 300 రుపాయలు వసూలు చేయడం జరుగుతుందన్నారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. పదేళ్ళ లోపు పిల్లలకు ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు,

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. బ్రేక్ దర్శనం టికెట్లను ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. తొలిరోజు ఆది శ్రీనివాస్ తో పాటు 75 మంది భక్తులు బ్రేక్ దర్శనం చేసుకున్నారు.

బ్రేక్ దర్శనాల ప్రారంభం పై మున్సిపల్ పాలక వర్గం ఆందోళన

వేములవాడ ఆలయంలో బ్రేక్ దర్శనాలు ప్రారంభం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం ఆందోళనకు దారి తీసింది. బ్రేక్ దర్శనాల ప్రారంభ సమాచారం పట్టణ ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్ పర్సన్ కు పాలక వర్గానికి సమాచారం ఇవ్వలేదన్ చైర్ పర్సన్ మాధవి, కౌన్సిలర్లు ఈవో కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈవో కు ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేములవాడలో మున్సిపల్ పరంగా పారిశుధ్యం పనులు మెరుగుపరిచి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే ఆలయ అధికారులు తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అధికారులను నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బిఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ ఉన్నారనే ఉద్దేశంతో సమాచారం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. సమాచార ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకముందు పొరపాటు జరగనివ్వమని క్షమించుమని ఆలయ అధికారులు వేడుకోవడంతో మున్సిపల్ పాలక వర్గం ఆందోళన విరమించింది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel

టాపిక్

Devotional NewsTemplesHindu FestivalsVemulawada Assembly Constituency
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024