Best Web Hosting Provider In India 2024
AP Mlc Elections: . రాష్ట్రంలో అసెంబ్లీ వేడి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న రాజకీయ పార్టీలకు మళ్లీ పరీక్ష మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయన రాజీనామాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే శాసనమండలి చైర్మన్ ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.
వైసీపీకి బొత్స…మరి టీడీపీ కూటమి అభ్యర్థి ఎవరు?
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ కూటమి ఎలాగైన ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అలాగే తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహా రచన చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ ఇప్పటికే ఉత్తరాంధ్రాలో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణను అభ్యర్థిగా ప్రకటించింది.
టీడీపీ కూటమి ఇంకా మంతనాలు చేస్తూనే ఉంది. సోమవారం రాత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని సీతంపేటలోని ఆయన నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కోళ్ల లలితకుమారి, వెలగపూడి రామకృష్ణబాబు, కేఎస్ఎన్ రాజు, బీజేపీ ఎమ్మెల్యే పీ. విష్ణుకుమార్ రాఉ, జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గండిబాబ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ ఇన్‌ఛార్జి దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ టిక్కెట్టు ఆశిస్తున్నవారు ముగ్గురు ఉన్నారు. అందులో ఒకరు టీడీపీ విశాఖపట్నం లోక్‌సభ అధ్యక్షుడు గండిబాబ్జీ కాగా, మరో ముగ్గురు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యన్నారాయణ, పీవీజీ కుమార్, తాతయ్యబాబులు ఉన్నారు. వీరి పేర్లను పార్టీ అధిష్ఠానానికి పంపించారు. అయితే టీడీపీ విశాఖపట్నం లోక్‌సభ అధ్యక్షుడు గండి బాబ్జీని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.
నేటీ నుంచి నామినేషన్ల పర్వం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి నేడు నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ జారీ చేయనున్నారు. నేటీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 (మంగళవారం) వరకు జరుగుతుంది. ఈనెల 14న నామినేషన్లను పరిశీలిస్తారు. 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు. ఈనెల 30 తేదీన ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది.
రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆయనకు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల డీఆర్‌వోలు వ్యవహరిస్తారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం, భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు ఆర్‌డీఓ కార్యాలయాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలు పెడతారు. ఈ 838 మంది ఓటర్లు ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించు కుంటారు. పోటీ చేసే అభ్యర్థిని మొత్తం పది మంది ఓటర్లు బపరచాల్సి ఉంటుంది.
838 ఓట్లతో జాబిత సిద్ధం..
ఎమ్మెల్సీ ఎన్నికకు 838 ఓట్లతో జాబితాను సిద్ధం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 652 మంది ఎంపీటీసీలకు గాను 16 ఖాళీగా ఉన్నాయి. 39 జెడ్పీటీసీలకు గాను మూడు ఖాళీగా ఉన్నాయి. 98 కార్పొరేషన్ వార్డులకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిపి 822 మంది ఓటర్లు ఉన్నారు.
విశాఖపట్నంలో నలుగురు (దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమ), భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి ఎమ్మెల్యేలు, విశాఖపట్నం, అనకాపల్లి లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, ఎమ్మెల్సీలు రవీంద్రబాబు, డి.రామారావు, వేపాడ చిరంజీవి జీవీఎంసీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు.
నర్సీపట్నం, ఎలమంచిలి ఎమ్మెల్యేలు నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలటీల్లో కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 16 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉంది. దీంతో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారు.
విశాఖపట్నంలో ఎన్నికల కోడ్..
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీజీఆర్ఎస్)ను రద్దు చేశారు. జీవీఎంసీ, కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్‌లో జరగాల్సిన పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే జీవీఎంసీ పరిధిలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ రద్దు చేశారు. సెప్టెంబర్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్