Best Web Hosting Provider In India 2024
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ వివాదంలో చిక్కుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె చేసిన యాడ్స్ ఇప్పుడు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. గతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సుమ బ్రాండ్ అంబాసిడార్‌గా చేశారు. ఈ క్రమంలో కొన్ని యాడ్స్‌లో కనిపించారు. దీంతో ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు పాపులర్ అయ్యాయి. కొందరు ప్రజలు ఫ్లాట్ల కోసం ఆ సంస్థకు డబ్బులు చెల్లించారు. అయితే, ఇప్పటి వరకు ఆ కంపెనీ ఎలాంటి నిర్మాణాలు పూర్తి చేయలేదు. డబ్బు చెల్లించిన వారికి ఫ్లాట్లు ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం యాంకర్ సుమ మెడకు చుట్టుకుంది.
సుమపై విమర్శలు
ఓ సంస్థ అపార్ట్మెంట్లు నిర్మించకుండా బోర్డు తిప్పేసిందని తెలుస్తోంది. అయితే, సుమ కనకాల యాడ్స్ చేయడం వల్లే తాము ఆ సంస్థకు డబ్బు చెల్లించామని, ఇప్పుడు మోసపోయామని కొందరు విమర్శిస్తున్నారు. చాలా మంది సుమారు రూ.25లక్షలను చెల్లించామని చెప్పి వాపోతున్నారు. ఈ విషయంలో సుమపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం పెద్దది అవుతుండటంతో సుమ స్పందించారు.
అప్పుడే ముగిసింది
తాను 2016 నుంచి 2018 వరకు మాత్రమే రాకీ అవెన్యూస్ రియల్ ఎస్టేట్ సంస్థకు తన ప్రొఫెషనల్ సర్వీస్‌లు అందించానని, అప్పుడే ఇది ముగిసిందని సోషల్ మీడియాలో నేడు ఓ లెటర్ రిలీజ్ చేశారు సుమ. ప్రస్తుతం అవి చెల్లవని, ఈ విషయంపై తాను లీగల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. “నేను గతంలో రాకీ అవెన్యూస్కు చేసిన అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని నా దృష్టికి వచ్చింది. 2016 నుంచి 2018 మధ్య నేను ఆ సంస్థకు నేను ప్రొఫెషనల్ సర్వీస్ అందించాను. అది అప్పుడే ముగిసిపోయింది. ఇప్పుడు ఆ యాడ్స్ చెల్లుబాటు కావు. ఆ కాలం తప్ప వేరే సమయాల్లో నేను రాకీ అవెన్యూస్కు ప్రాతినిథ్యం వహించలేదు” అని సుమ క్లారిటీ ఇచ్చారు.
ఈ సమస్య పరిష్కారమయ్యేందుకు కావాల్సిన న్యాయపరమైన చర్యలను తాను తీసుకుంటానని సుమ పేర్కొన్నారు. “ఈ సమస్య పరిష్కారమయ్యేలా దీనికి సంబంధించిన అందరిపై లీగల్ చర్యలు తీసుకుంటా. గతంలోనూ రాకీ అవెన్యూస్లో ఆస్తుల అమ్మకాల గురించి నాకు నోటీసులు వచ్చాయి. వాటికి కూడా నేను రిప్లై ఇచ్చాను. రాకీ అవెన్యూస్కు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపాను” అని సుమ రాసుకొచ్చారు.
తప్పుడు సమాచారాన్ని తప్పించుకునేందుకు ఏ యాడ్ అయినా, వీడియోలను అయినా అధికారిక ఛానెళ్లలోనే చూడాలని ప్రజలకు సుమ సూచించారు. అందరి ప్రైవసీని గౌరవిస్తూ.. ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని కోరారు. తనకు సపోర్ట్ చేస్తూ.. అర్థం చేసుకుంటున్న వారికి ధన్యవాదాలు అంటూ తన లెటర్ ముగించారు సుమ.
మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ మోసం సుమకు చుట్టుకుంది. విజయవాడ, రాజమండ్రి సమీపంలో రూ.26లక్షల నుంచి ఫ్లాట్లు ఇస్తామంటూ చెప్పిన రాకీ అవెన్యూస్ వందలాది మంది వద్ద డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సంస్థ ఎండీ పరారీలోకి వెళ్లినట్టు సమాచారం. ఇప్పటి వరకు డబ్బు కట్టిన ఎవరికీ ఫ్లాట్లు అప్పగించలేదని, నిర్మాణాలే పూర్తి చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.