Akhtar on Neeraj Chopra Mother: నీరజ్ చోప్రా తల్లికి సెల్యూట్ చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. ఇదీ కారణం

Best Web Hosting Provider In India 2024


Akhtar on Neeraj Chopra Mother: పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవికి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సెల్యూట్ చేశాడు. గురువారం (ఆగస్ట్ 8) రాత్రి జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ గోల్డ్ గెలవగా.. నీరజ్ సిల్వర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అతడూ నా కొడుకే: నీరజ్ తల్లి

టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి కూడా ఆ రికార్డును రిపీట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఒలింపిక్స్ రికార్డు క్రియేట్ చేశాడు. గోల్డ్ ఎగరేసుకుపోయాడు. నీరజ్ 89.45 మీటర్ల దూరం విసిరి తన సీజన్ బెస్ట్ త్రో నమోదు చేసినా.. సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు.

ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి స్పందించారు. ఆ గోల్డ్ గెలిచిన అబ్బాయి కూడా నా కొడుకే అని ఆమె అనడం గమనార్హం. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆమెకు సెల్యూట్ చేశాడు. “మాకు సిల్వర్ దక్కడం సంతోషంగా ఉంది. గోల్డ్ గెలిచిన వ్యక్తి కూడా నా కొడుకే” అని సరోజ్ దేవి చెప్పింది.

దీనిపై అక్తర్ స్పందిస్తూ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. “గోల్డ్ గెలిచిన వ్యక్తి కూడా నా కొడుకే.. ఈ మాట కేవలం ఓ అమ్మ మాత్రమే అనగలదు.. అద్బుతం” అని అక్తర్ ట్వీట్ చేశాడు. జావెలిన్ తో నీరజే తనకు స్ఫూర్తి అని అర్షద్ చాలాసార్లు చెప్పాడు. కిందటిసారి నీరజ్ గోల్డ్ గెలవగా.. అర్షద్ ఒట్టి చేతులతో వెళ్లాడు. ఈసారి అదే నీరజ్ ను వెనక్కి నెట్టి గోల్డ్ గెలవడం విశేషం.

ఆ ఒక్కడే దేశాన్ని గర్వించేలా చేశాడు: అక్తర్

ఇక పారిస్ ఒలింపిక్స్ లో పాకిస్థాన్ కు ఏకైక మెడల్ అది కూడా గోల్డ్ అందించిన అర్షద్ నదీమ్ పైనా అక్తర్ ప్రశంసలు కురిపించాడు. “ఎక్కడి నుంచో వచ్చి ఈ సింహం పాకిస్థాన్ కు గోల్డ్ మెడల్ అందించాడు. నువ్వో అద్భుతమైన వ్యక్తివి అర్షద్. నీ సామర్థ్యం, కఠోర శ్రమతో నువ్వు దీనిని సాధించావు. అర్షద్ నీకు శుభాకాంక్షలు. ఒక్క గోల్డ్ మెడల్ తో మొత్తం పాకిస్థాన్ మూడ్ మారిపోయింది. ఒకే ఒక్కడు అర్షద్ ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ ట్రెండింగ్ లో ఉండేలా చేశాడు” అని అక్తర్ తన వీడియోలో అన్నాడు.

మరో స్టార్ పాక్ బ్యాటర్ బాబర్ ఆజం కూడా ట్వీట్ చేశాడు. “30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాకిస్థాన్ కు గోల్డ్ తిరిగి వచ్చింది. ఈ అద్భుతమైన ఘనత సాధించిన అర్షద్ కు శుభాకాంక్షలు. మొత్తం దేశాన్ని గర్వించేలా చేశావు” అని బాబర్ అన్నాడు.

Best Web Hosting Provider In India 2024



Source link