Sunkishala Incident : ‘సుంకిశాల’ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తారు, ప్రభుత్వానికి నష్టం లేదు – మంత్రి ఉత్తమ్

Best Web Hosting Provider In India 2024


నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలోని సుంకిశాల ప్రాజెక్టు ను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు . హైదరాబాద్ మహానగరానికి తాగునీటిన అందించే సుంకిశాల ప్రాజెక్టు పంప్ హౌస్ లో రిటైనింగ్ వాల్ కూలిపోయి సంపులోకి భారీ ఎత్తున కృష్ణా జలాలు చేరిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఇప్పటికే అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇంజనీరింగ్ అధికారులను వాకబు చేశారు.

 

నాగార్జున సాగర్ వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కూలిపోయిన సుంకిశాల సైడ్ వాల్ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా. కృష్ణానదిపై ప్రాజెక్టుల పనులు జరగలేదు. సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో నాటి సీఎం కేసీఆర్, నాటి మంత్రి కేటీఆర్ కే తెలియాలి. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదు. కేటీఆర్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. గత ప్రభుత్వ హయాంలోనే సుంకిశాల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి , పనులు చేపించింది కూడా గత ప్రభుత్వమే. నేటి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. జరిగిన నష్టాన్ని మొత్తం కాంట్రాక్టర్ భరించి , ప్రాజెక్టు ని పూర్తి చేయాలి. అనవసరమైన రాజకీయ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు..” అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ముందు నుంచీ అయన వ్యతిరేకంగానే ఉన్నారు.

 

కాంట్రాక్టర్ భరిస్తారు – మంత్రి ఉత్తమ్

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జరిగిన సంఘటన చిన్నది.. నష్టం కూడా తక్కువే అని అన్నారు. నష్టం కాంట్రాక్టర్ భరిస్తారని చెప్పారు. “ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు.. నిర్మాణంలో లేదు. నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు ఆలస్యం అవుతుంది” అని తెలిపారు.

 

“గత ప్రభుత్వం ఎస్.ఎల్.బి.సి పూర్తి చేయలేదు. ఎస్.ఎల్.బి.సి. ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకం సైతం పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే జరిగాయి. సోషల్ మీడియా ద్వారానే సుంకిశాల ప్రమాదం ప్రభుత్వానికి తెలిసింది. ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించింది. హైదారాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు విచారణ చేస్తున్నారు.సీఎం వచ్చిన తరువాత చర్చించి చర్యలు తీసుకుంటాము . బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. అవునన్నా కాదన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసింది” అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

 

నల్లగొండ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి , రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందన్న ఆయన… నష్టం అంతా నిర్మాణ సంస్థ భరిస్తుందని చెప్పారు. “ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలి” అని పేర్కొన్నారు.

 

గడిచిన రెండు రోజులుగా సుంకిశాల ప్రాజెక్టు సంఘటనపై రాజకీయ దుమారం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ కూడా తమ బృందం సుంకిశాలను సందర్శిస్తుందని ప్రకటించారు. ఈ లోగా రాష్ట్ర మంత్రులు, జిల్లాకే చెందిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సుంకిశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

 

సాగర్ కు కొనసాగుతున్న వరద:

నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు ఇంకా పోటెత్తుతూనే ఉంది. ఎగువలోని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇన్ ఫ్లో తగ్గలేదు . ఇప్పటికే సాగర్ జలాశయం దాదాపు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఎగువ కృష్ణా నుంచి వస్తున్న నీటినంతా దిగువకు సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు.

 

సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న టెల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వదిలేస్తున్నారు. అంతేకాకుండా సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా కూడా జలాలను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కు ఉన్న ప్రధాన జల విద్యుత్ కేంద్రంతో పాటు, కుడి, ఎడమ కాల్వలపై ఉన్న కేంద్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

 

ఆదివాయంర ఉదయం 6 గంటల సమయానికి సాగర్ ప్రాజెక్టులో నీటి నిలువల వివరాలు ఇలా ఉన్నాయి.

 

  • నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం : 588 అడుగులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.50 టిఎంసిలు
  • ప్రస్తుత నీటి నిల్వ : 306.10.టీఎంసీలు
  • ఇన్ ఫ్లో : 3,47,112. క్యూసెక్కులు
  • టోటల్ ఔట్ ఫ్లో : 3,47,112. క్యూసెకులు
  • సాగర్ డ్యామ్ కు ఉన్న 26 క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

 

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsUttam Kumar ReddyNalgondaNagarjuna Sagar
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024