Fake food inspector : గ్యాంగ్ సినిమా తరహాలో రైడ్స్, ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అరెస్ట్

Best Web Hosting Provider In India 2024


Fake food inspector : ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు హల్ చల్ చేశారు. సినీ ఫక్కీలో హడావుడి సృష్టించారు. ఆహార తనిఖీ అధికారులమంటూ ఖమ్మం నగరం మమత హాస్పిటల్ రోడ్ లోని కింగ్ దర్బార్ హోటల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన మాంసం, కాలం చెల్లిన నిత్యావసర సరుకులు వినియోగిస్తున్నారంటూ హోటల్ యజమానిపై ఫైర్ అయ్యారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని మండిపడ్డారు. కిచెన్ లోకి వెళ్లి సెల్ లో వీడియో తీస్తూ భయపెట్టారు. దీంతో హోటల్ యజమాని బెంబేలిత్తిపోయాడు. మీ హోటల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని, హైదరాబాద్ నుంచి తమను ఆకస్మిక విచారణ కోసం పంపారంటూ కేటుగాళ్లు బుకాయించారు. ఉన్నతాధికారులకు విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో ఖమ్మం జిల్లా కలెక్టర్ సీసీ, జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు తలా యాభై వేలు ఇవ్వాల్సి ఉంటుందని ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు చెప్పుకొచ్చారు.

జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయడంతో

రూ.2 లక్షలు అడగడంతో అనుమానం వచ్చిన హోటల్ యజమాని జబ్బీర్ ఖాన్ స్థానిక ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించారు. అయితే తమ శాఖ నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఏమీ లేవని జిల్లా స్థాయి ఆహార తనిఖీ అధికారి కిరణ్ కుమార్ స్పష్టం చేయడంతో బాగోతం బయటపడింది. వెంటనే ఆ యజమాని హోటల్ తనిఖీకి వచ్చింది కేటుగాళ్లని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేసి ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన నిందితులు గతంలోనూ ఇలాంటి దాడులకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పట్టుబడిన నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ రావ్, బానోత్ రామస్వామి, సపావత్ యువరాజ్, అజ్మీరా యువరాజ్ సింగ్ గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaFoodKhammamCrime Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024