Best Web Hosting Provider In India 2024
Karimnagar News : కట్టుకున్నవాడు కాలం చేశాడు.. ఆదరించాల్సిన అత్తింటివారు దూరం పెట్టారు. ముగ్గురు పిల్లల తల్లి బతుకు రోడ్డు పాలైంది. తాళం వేసిన ఇంటి ముందు ముగ్గురు పిల్లలతో భర్త సంవత్సరికం చేసింది. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాకతీయ కాలనీలో జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జీలుగులకు చెందిన రవళికి, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన శ్రావణ్ లకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక అబ్బాయి జన్మించారు. అనూహ్యంగా శ్రవణ్ అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలు చేయించగా… క్యాన్సర్ అని తేలింది. చికిత్స చేయించుకుంటున్న క్రమంలో శ్రవణ్ గత ఏడాది ఆగస్టు 23న మృతి చెందాడు. భర్తను కోల్పోయిన రవళి ముగ్గురు పిల్లలతో దీనావస్థలు ఎదుర్కొంటుంది. భర్త మృతితో ఇంటిని ఖాళీ చేయాల్సి రావడంతో రవళి ముగ్గురు పిల్లలతో మరో చోట అద్దెకు ఉంటుంది. అయితే శ్రవణ్ మృతి చెందిన తర్వాత కోడలు రవళిని అత్తింటి వారు పట్టించుకోవడం మానేశారు. ఇంటికి కూడా రానివ్వడం లేదు.
తాళం వేసిన ఇంటిముందు పిల్లలతో భర్తకు సంవత్సరీకం
అనారోగ్యంతో భర్త మృతి… ఆదరించని అత్తింటి వారిని తలుచుకుంటూ ముగ్గురు పిల్లలతో రవళి మనోవేదనకు గురవుతుంది. అత్తింటి వారు పెడుతున్న ఇబ్బందులతో నరకం అనుభవిస్తుంది. పసిపిల్లలను పోషించడంమే కష్టంగా మారిన పరిస్థితుల్లో భర్త మృతి చెంది ఏడాది కావస్తోంది. దీంతో సంవత్సరికం చేయాల్సి ఉండగా అత్తింటివారు సహకరించకపోవడంతో, ఇంటి ముందే సంవత్సరికం తంతు పూర్తిచేసింది. అత్తమామలు వీరగోని మొగిలి, లచ్చమ్మలు ఇంటికి తాళం వేసి అడ్రస్ లేకుండా పోవడంతో ముగ్గురు పిల్లలతో రవళి తాళం వేసిన ఇంటి ముందే కుర్చీలో భర్త పోటో పెట్టి సంవత్సరికం తిథిని చేసింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కోడలు, మనువడు మనుమరాళ్లను ఆదరించాల్సిన వారు పట్టించుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవ సంబంధాలకు అర్థం లేదా అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.
న్యాయం చేయాలని వేడుకోలు
నిలువ నీడ లేక ముగ్గురు పిల్లల తల్లి తాళం వేసి ఉన్న అత్తగారి ఇంటి ముందు భర్త సంవత్సరికం తంతు పూర్తి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. తనతో పాటు ముగ్గురు బిడ్డల బాగోగులు చూసుకోవాలని వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని రవళి ఆరోపిస్తోంది. అత్తమామలు తనను ఆదరించడం లేదని, మిగతా కుటుంబ సభ్యులు తమను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని రవళి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, బిడ్డలను ఆదుకోవాలని కోరుతోంది. రవళికి అత్తింటి వారు సహకరించకపోవడం సరైన పద్దతి కాదంటున్నారు స్థానికులు. అందుబాటులో లేని అత్తింటి వారు కోడలి నిరసనతో ఏ విధంగా స్పందిస్తారో చూడాలంటున్నారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్