Amazon Web Services : అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ – హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత డేటా సెంటర్!

Best Web Hosting Provider In India 2024


అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు.

ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ ప్రారంభించింది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు (AWS) సంబంధించి హైదారాబాద్లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్నివిస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు.

హైదరాబాద్ లో మోనార్క్ ట్రాక్ట‌ర్స్ విస్త‌ర‌ణ‌

హైద‌రాబాద్‌లో త‌మ సంస్థ విస్త‌ర‌ణ‌కు మోనార్క్ ట్రాక్ట‌ర్ (Monarch Tractor) సంస్థ ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని త‌మ ప‌రిశోధ‌న-అభివృద్ధి సంస్థ‌ను విస్త‌రించే అంశంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడిన బృందం ఆ సంస్థ ప్రతినిధులో చర్చించారు.

అనంత‌రం సంస్థ ప్ర‌తినిధులు హైదరాబాద్‌లో త‌మ ఆర్ అండ్ డీ సంస్థ‌కు అనుబంధంగా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామ‌న్నారు. మోనార్క్ ట్రాక్టర్స్‌ను తెలంగాణ‌కు ఆహ్వానిస్తున్నామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్వయంప్రతిపత్తి ,ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిచేలా… ఆ విజ‌న్‌లో మోనార్క్ ట్రాక్ట‌ర్స్ బాగ‌మై రాష్ట్రంలో తమ ఉనికిని విస్త‌రించుకోవాల‌ని ఆశిస్తున్న‌ామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని త‌మ R అండ్ D కేంద్రం అధునాతన డ్రైవర్-ఆప్ష‌న్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లను రూపొందించడంలో కీలకపాత్ర పోషించింద‌ని సంస్థ సీఈవో ప్రవీణ్ పెన్మెత్స తెలిపారు. తెలంగాణలో త‌మ కార్యకలాపాలను విస్తరించేందుకు తాము చూస్తున్నామ‌ని చెప్పారు. ఫ‌లితంగా హైద‌రాబాద్ ప్రాంతంలో మ‌రింత ఉత్ప‌త్తి, ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అన్నారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్తి, డ్రైవర్ తోనూ, డ్రైవ‌ర్ లేకుండానే న‌డిచే స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల‌తో మోనార్క్ ట్రాక్ట‌ర్ (Monarch Tractor) సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని మోనార్క్ ప్రతినిధులు వివరించారు.

టాపిక్

InvestmentTelangana NewsCm Revanth ReddyBusiness

Source / Credits

Best Web Hosting Provider In India 2024