Best Web Hosting Provider In India 2024
కర్నాటకలో ఇటీవలే వచ్చిన వరదలతో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. దీంతో దిగువన ఏపీలో ఆందోళన నెలకొంది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో తుంగభద్ర డ్యామ్‌కు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆందోళన చెందుతోంది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిస్థితిని పర్యవేక్షిస్తోన్నారు. గేటు ఏర్పాటుకు ప్రత్యామ్నాయ చర్యలకు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కాగా డ్యామ్‌కు చెందిన అన్ని గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది. తుంగభద్ర డ్యామ్ నుంచి 60 టీఎంసీల నీరు వృథాగా పోనుందని అధికారులు అంచనా వేస్తోన్నారు. ఎగువన షిమోగలో వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు భారీగా వదర నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
ఇప్పటికే తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గేటు మరమ్మత్తులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. మరోవైపు ఎగువన నుంచి వరద నీరు వచ్చిన ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని అధికారులు చెబుతోన్నారు. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మత్తులు చేపట్టనున్నారు. అయితే డ్యామ్ సేఫ్టీకి ఎలాంటి సమస్య లేదని నీటిపారుదల నిపుణుల బృందం చెబుతోంది.
కృష్ణా నదికి ఉపనది తుంగభద్ర నదిపై తుంగభద్ర ఆనకట్ట కర్నాటకలోని హోస్పేట్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది బహుళార్ధ సాధక ఆనకట్ట. నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి, వరదలను నియంత్రించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత 1953 నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉంది. 1957లో ప్రాజెక్టు పనిచేయడం ప్రారంభం అయింది. దీని ఖర్చు కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 80ః20 నిష్పత్తిలో భరించారు.
ఈ ఆనకట్టతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు, కర్నాటకలోని బళ్లారి, రాయచూర్ జిల్లాలకు నీటిని అందిస్తారు. ఈ డ్యామ్ లోలెవెల్స్ (ఎల్ఎల్సీ) కెనాల్ ద్వారా కర్నూల్ జిల్లాకు తాగునీరు అందిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లో ఎల్ఎల్సీ కెనాల్ కింద సుమారు 1.52 లక్షల ఎకరాల ఆయకట్లు ఉంది. 200 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తును కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు అందిస్తారు.
అలాంటి తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో దిగువన ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే అధికారులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతోన్నారు. ప్రత్యామ్నాయ చర్యలకు ప్రభుత్వం యోచిస్తోంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్