Best Web Hosting Provider In India 2024

Anam Ramanarayana Reddy : రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో పాలకమండళ్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన రాష్ట్ర సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించిన పలు దస్త్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. ధూపదీప నైవేద్యాల ఆర్థిక సాయాన్ని రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ. 50 వేల కంటే తక్కువ ఆదాయం వచ్చే ఆలయాలకు ఆర్థికసాయం పెంచుతామన్నారు. దీంతో దేవదాయశాఖపై రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అలాగే సీజీఎఫ్ కింద 160 ఆలయాలు పునర్నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలోని 27,127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. దేవాలయాల భూములు పరిశీలించి, ఆక్రమణలు తొలగిస్తామన్నారు.
తిరుమల నుంచే ప్రక్షాళన
తిరుమల క్షేత్రం నుంచే దేవదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణలో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకని, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామన్నారు. కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతి పునరుద్దరిస్తామన్నారు. గత ప్రభుత్వం తిరుమల నుంచి అరసవల్లి వరకు దేవాలయాల భూములు అన్యాక్రాంతం చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తున్నామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రూ.50 వేలకు తక్కువ ఆదాయం ఉన్న దేవస్థానాలకు ధూపదీప నైవేద్యాలకు రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతి
నెల్లూరు జిల్లాలో రెండు దేవాలయాల్లో తప్పులు జరిగినట్లు గుర్తించి ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. వారిపై విచారణ కొనసాగుతోందన్నారు. తప్పులు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలోని కొన్ని ఆలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతి పునరుద్దరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్