Best Web Hosting Provider In India 2024
Beedar Gutkha: తెలంగాణలో గత కొన్నేళ్లుగా గుట్కా అమ్మకాలపై కఠినమైన నిషేధం అమలులో ఉన్నా, పాన్ షాపులు, కిరాణా షాపుల్లో గుట్కా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో గుట్కా తయారు, సరఫరా పైన నిషేధం విధించినా, ఇవి ఎక్కడి నుండి రాష్ట్రంలోకి వస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
పొలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మన పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, ఆ రాష్ట్రంలో నుండే మరికొన్ని ప్రాంతాల నుండే స్మగ్లర్స్ రాష్ట్రంలోకి గుట్కా సరఫరా చేస్తున్నారన్నారు. గత నెలరోజులుగా, రెండు సార్లు పెద్దమొత్తంలో బీదర్ నుండి హైదరాబాద్ గుట్కా అక్రమంగా సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఈ రెండు సంఘటనలు కూడా, ఆ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. గత జులై 15 రోజు పోలీసులు 35 లక్షల రూపాయల విలువైన గుట్కాని లారీలో బీదర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు స్వాధీన పరుచుకోగా, తాజాగా ఆదివారం రోజు మరొక 45 లక్షల రూపాయల విలువైన గుట్కాని అల్గోల్ జంక్షన్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చెక్ పోస్ట్ పని తీరు పై అనుమానాలు…
ఇంత పెద్ద స్థాయిలో గుట్కా ను పక్క రాష్ట్రం నుండి తరచుగా తరలిస్తుండటంతో, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ సిబ్బంది పనితీరు పైన సందేహాలు వెల్లువెత్తు తున్నాయి. కర్ణాటక తెలంగాణ రాష్ట్రల సరిహద్దుల్లో చిరాగ్ పల్లి వద్ద చెక్ పోస్ట్ ఉన్నా, యధేచ్చగా గుట్కాను హైదరాబాద్ కు తరలించడం పైనా పలు అనుమానాలకు తావిస్తుంది.
విచిత్రమేమిటంటే, కర్ణాటక రాష్ట్రంలో గుట్కా అమ్మకాల పైన, తయారు, సరఫరా పైన పూర్తీ నిషేధం ఉంది. అయినా, అక్కడి నుండి, పెద్ద ఎత్తున తెలంగాణ కు, ముఖ్యంగా హైదరాబాద్ కు గుట్కా ని తరలించడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం, అధికారులు ఎంత కమిటీట్మెంట్ తో గుట్కా బాన్ అమలు చేస్తున్నదో ఈ అక్రమ సరఫరా తెలియజేస్తుంది.
గుట్కా సరఫరా పై కన్ను పెట్టండి: ఐజీ
ఇటీవల మల్టీ జోన్-2 ఐ.జి వి.సత్యనారాయణ సంగారెడ్డి లో పర్యటించి, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తుల పైన కఠిన నిషేధం అమలుపర్చాలని అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండటం వలన పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ అక్రమ రవాణా జరగటానికి అవకాశం ఉన్నందున వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా గుండా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.
జిల్లాలో మట్కా, గంజాయి, పేకాట వంటి నిషేధిత ఆటలు ఆడడానికి వెలులేదని, ఎవరైనా మట్కా నిర్వహిస్తున్నట్లు గాని, గంజాయి పండించినా, అక్రమ రవాణా చేస్తున్నట్లుగాని, మట్కా, పేకాట ఆడుతున్నట్లుగాని గుర్తించినట్లయితే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎవరైన పై చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడనని అన్నారు.
టాపిక్