Paddy Procurement : రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ, రూ.674 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

Best Web Hosting Provider In India 2024


Paddy Procurement Payments : ఏపీ సర్కార్ రైతన్నల ధాన్యం బకాయిలు చెల్లించింది. వైసీపీ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోలు బకాయిలను సోమవారం విడుదల చేసింది. మొత్తం 84,724 మంది రైతులకు రూ.1674.47 కోట్లు బకాయిలు ఉండగా…మొదటి విడతలో రూ.1000 కోట్లు, ఇవాళ రెండో విడతలో రూ.674.47 కోట్లు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు సొంత కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించుకున్నారని, రైతుల బకాయిలు చెల్లించలేదని టీడీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ఆదేశాలతో ధాన్యం కొనుగోలు బకాయిలు పూర్తిగా చెల్లించి రైతులను ఆదుకున్నారని తెలిపింది.

ధాన్యం బకాయిలు చెల్లింపులు

ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ…వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే…ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టకాలంలో ఉన్నా గత నెలలో రూ.1000 కోట్లు, ఇవాళ మిగిలిన రూ.674 కోట్లు విడుదల చేశామన్నారు.

వచ్చే ఖరీఫ్ నుంచి 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో ధాన్యం బకాయిలు రూ.472 కోట్లు జమ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ వేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. గత ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత నిధులతో కౌలు రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా వెనుకాడబోమని, చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు.

నిత్యావసరాల ధరల నియంత్రకు చర్యలు

నిత్యావసర వస్తువుల ధరలను నియత్రించి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే రైతు బజార్లలో తక్కువ ధరకు నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులను అందిస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో అందించే నిత్యవసరాల నాణ్యతలో రాజీపడమన్నారు. తానే స్వయంగా అధికారులు కలిసి 251 స్టాక్ పాయింట్లను పరిశీలించి నాణ్యత గల వస్తువులనే ప్రజలకు అందించాలని ఆదేశించామని తెలిపారు. నాణ్యతా లోపంతో సరకులు పంపిణీ చేసిన 19 సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsFarmersPaddy ProcurementTrending ApTelugu NewsNadendla Manohar

Source / Credits

Best Web Hosting Provider In India 2024