Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం
ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ ఎత్తేయడం దారుణం
జాతీయ విద్యా విధానం ఏపీలో అమలు చేస్తారా? లేదా?
గత 5 ఏళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, ఐఎఫ్‌పీలు..
స్మార్ట్ టీవీలు, సీబీఎస్ఈ, టోఫెల్ శిక్షణ అమలు
విద్యా రంగంపై ఏకంగా రూ.73 వేల కోట్లు వ్యయం
ప్రెస్మీట్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం తిరోగమనం బాట పట్టిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కొన్ని సర్దుబాట్లు చేయాలనే సాకుతో, విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలని, సంస్కరణలు చేస్తామంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అదే సమయంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎత్తేస్తున్నారని గుర్తు చేశారు.
టోఫెల్ శిక్షణ రద్దు, ఇంగ్లీషు మీడియంను ఎత్తేసే కార్యక్రమంపై ప్రభుత్వ పెద్దల మాటలు చూస్తుంటే విద్యా రంగం అస్తవ్యస్తం అవుతోందన్న విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి తెలిపారు. విద్యా వ్యవస్థలో 5 ఏళ్ల వైయస్ఆర్సీపీ పాలన నిర్ణయాలను రద్దు చేసి, ప్రజలకు నష్టం కలిగిస్తే సహించబోమని ఆయన తేల్చి చెప్పారు.
నాడు సీఎం వైయస్ జగన్, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, ఆ రంగంపై ఏకంగా రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన ప్రిప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు థీటుగా తీర్చిదిద్దితే, దానిపైనా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇవన్నీ చూస్తుంటే, ఈ ప్రభుత్వం జాతీయ విద్యా విధానాని (ఎన్ఈపీ)కి అనుకూలమా? వ్యతిరేకమా? అన్న అనుమానం కలుగుతోందన్న మాజీ మంత్రి, అసలు ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు.
గత 5 ఏళ్లలో గోరుముద్ద కింద రూ.7,244 కోట్లు, తొలి విడత నాడు–నేడు మనబడి కార్యక్రమంలో 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, రెండో విడత 22,344 స్కూళ్లలో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని.. రెండూ కలిపి మొత్తం రూ.11,669 కోట్లు వ్యయం చేశామని వెల్లడించారు. డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1306 కోట్లతో 9,52,925 మందికి బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్‌లు అందించామన్నారు. 6వ తరగతి, ఆపైన విద్యార్థులకు ప్రతి తరగతిలోనూ 62 వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశామన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2019–20లోనే అమ్మ ఒడి అమలు చేశామని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదే ఈ ప్రభుత్వం, ఈ ఏడాది తల్లికి వందనం కేటాయింపులు చేయడానికి కూడా జంకుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. నారాయణ, చైతన్య స్కూళ్లపై మీకు ప్రేమ ఉండొచ్చని, పీపీపీపైనా మోజు ఉండొచ్చని, కానీ విద్యా రంగంలో వాటిని తీసుకు రావొద్దని ఆదిమూలపు సురేష్ సూచించారు.