CM Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్, రేపే మూడో విడత రుణమాఫీ- ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి చెక్కుల పంపిణీ

Best Web Hosting Provider In India 2024


CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. పంద్రాగస్టు రోజున ఆయన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెట్టుబడులే లక్ష్యంగా పొరుగు దేశాలకు వెళ్లి వచ్చిన మరుసటి రోజునే ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటన ఖరారు కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లాలోని వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికపై నుంచి మూడో విడత రుణ మాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైతులకు చెక్కులను అందజేసి రుణమాఫీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి గోదావరి నీటిని లాంఛనంగా జిల్లాకు విడుదల చేస్తారు. రూ. 18 వేల కోట్ల వ్యయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాల సాగు భూమికి నీరందించి సస్యశ్యామలం చేసే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేయనున్నారు. మూడు పంప్ హౌస్ లను స్విచ్ ఆన్ చేసి సీఎం ప్రారంభిస్తారు. అనంతరం వైరా కేంద్రంలో జరిగే భారీ బహిరంగలో పాల్గొంటారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతానికి అటు జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు అధికార యంత్రాంగం సైతం ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసింది.

రెండోసారి ఖమ్మంలో

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్చి 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా ఆగస్టు 15వ తేదీన జిల్లాలో బహిరంగ సభను నిర్వహించి మరో ప్రతిష్టాత్మక పధకమైన మూడో విడత రుణమాఫీని ప్రారంభించడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీంతో జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మరో ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే జీవిత లక్ష్యంగా శ్రమించిన తుమ్మల నాగేశ్వరరావు సొంత ఇలాఖా కావడంతో పాటు వ్యవసాయ శాఖా మంత్రిగా తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో మూడో విడత రైతు రుణ మాఫీని సీఎం ప్రారంభించడం అమిత ప్రాధాన్యతను సంతరించుకుంది.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsKhammamCm Revanth ReddyCrop LoansTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024