Olympics Medalists meet Modi: మోదీకి పిస్టల్ గురించి చెప్పిన మను.. హాకీ స్టిక్ గిఫ్ట్‌గా ఇచ్చిన టీమ్.. ప్రధానితో భేటీ

Best Web Hosting Provider In India 2024


Olympics Medalists meet Modi: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ నుంచి ఆరు పతకాలతో తిరిగి వచ్చిన భారత బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఆగస్ట్ 15) తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా షూటర్ మను బాకర్, రెజ్లర్ అమన్ సెహ్రావత్, సరబ్‌జ్యోత్ సింగ్, ఇండియన్ హాకీ టీమ్ సభ్యులు మోదీని కలిశారు. నీరజ్ చోప్రా మాత్రం హాజరు కాలేకపోయాడు.

మోదీకి హాకీ స్టిక్

పారిస్ క్రీడల్లో వరుసగా రెండో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు క్రీడాకారులందరూ సంతకం చేసిన స్టిక్ ను ప్రధానికి బహూకరించింది. ఇటీవలే రిటైరైన పీఆర్ శ్రీజేష్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సహా మిగిలిన ప్లేయర్స్ అందరూ కాంస్య పతకాలను మెడలో వేసుకొని ప్రధానితో ఫొటోలకు పోజులిచ్చారు.

పిస్టల్ గురించి వివరించిన మను

ఒలింపిక్స్ లో ఒకే ఎడిషన్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన షూటర్ మను బాకర్ కూడా మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆమె పిస్టల్ గురించి ప్రధానికి వివరించడం విశేషం. పారిస్ లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

మిగిలిన విజేతలతో..

ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో మనుతో కలిసి కాంస్య పతకం సాధించిన సరబ్ జ్యోత్ సింగ్, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లలో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కుశాలే కూడా ప్రధానితో మాట్లాడారు.

అటు పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ తన సంతకంతో కూడిన భారత జెర్సీతో ప్రధానితో కలిసి పోజులిచ్చాడు.

నీరజ్ రాలేదు

రజత పతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రం రాలేదు. అతడు తన గజ్జల్లో గాయానికి చికిత్సతోపాటు యూరప్ లో జరిగే డైమండ్ లీగ్ పోటీల్లో పాల్గొనేందుకు పారిస్ క్రీడల అనంతరం జర్మనీకి వెళ్లాడు.

మెడల్ గెలిచిన వాళ్లతోనే కాదు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మరికొంత మంది అథ్లెట్లతోనూ మోదీ మాట్లాడారు. వాళ్లలో బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ ఉన్నాడు. అతడు తృటిలో బ్రాంజ్ మెడల్ మిస్ అయిన సంగతి తెలిసిందే.

టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్), సైఖోమ్ మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్) కూడా ఉన్నారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన చారిత్రక ఎర్రకోట వద్ద భారత బృందం సభ్యులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024



Source link