weather update: ఈనెల 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన

Best Web Hosting Provider In India 2024


రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. రాజధాని నగరం హైదరాబాద్ భారీ వర్షానికి తడిసి ముద్దయింది. శుక్రవారం సాయంత్రం స్టార్ట్ అయిన వాన.. రాత్రి వరకు దంచి కొట్టింది. హయత్ నగర్, ఆసీఫ్ నగర్, బాలానగర్, పటాన్‌చెరు, ఉప్పల్, అల్వాల్, కుత్బుల్లాపూర్, గోల్కొండ, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నీటి కాలువల్లా మారిపోయాయి.

 

చిగురుమామిడిలో అత్యధికంగా…

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. 17.1 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్టు ఐఎండీ అధికారులు వెల్లడించారు. మెదక్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటు ఇద్దరు మృతిచెందారు. నందూరుకు చెందిన అంజన్న పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. పిడుగు పడింది. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కెరమెరికి చెందిన రమేష్.. తన చేనులో పనులు చేస్తుండగా పిడుగుపడింది. రమేష్ అక్కడికక్కడే మృతిచెందారు.

 

7 జిల్లాలకు భారీ వర్ష సూచన..

కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దాని మీదుగా ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో 7 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. మంగళవారం వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

టాపిక్

Ts RainsHyderabadTelangana NewsWarangalKarimnagar

Source / Credits

Best Web Hosting Provider In India 2024