Tasty dal recipes: పప్పు రుచిగా రావట్లేదా? ఇలా 3 రకాలుగా వండారంటే లొట్టలేస్తూ తినేస్తారు

Best Web Hosting Provider In India 2024


భారతీయ ఆహారంలో పప్పులు చాలా ముఖ్యమైనవి. చాలా ఇళ్లలో ప్రతిరోజూ పప్పు లేకుంటే ముద్ద దిగదు. అయితే రోజూ ఒకేరకమైన పప్పు తిని బోర్ కొట్టినా, లేదంటే పప్పు రుచి సరిగ్గా కుదరట్లేదనిపించినా ఈ మూడు రకాల పప్పులు ప్రయత్నించండి.

1. బెంగాళీ దాల్:

కావలసిన పదార్థాలు:

• శనగపప్పు: 1 కప్పు

• కొబ్బరి (1 అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి): 1/2 కప్పు

• పసుపు: 1 టీస్పూన్

• ఉప్పు: రుచికి తగినంత

• ఆవనూనె: 2 టీస్పూన్లు

• జీలకర్ర: 1/2 టీస్పూన్

• పచ్చిమిర్చి: 2

• తురిమిన అల్లం: 1 ముక్క

• ఎండుమిర్చి: 3

• లవంగాలు: 2

• దాల్చినచెక్క: అంగుళం ముక్క

• బిర్యానీ ఆకులు: 2

బెంగాళీ దాల్ తయారీ విధానం:

  1. శనగపప్పును శుభ్రంగా కడిగి గంటసేపు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు ఈ పప్పును కుక్కర్ లో రెండున్నర కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి.
  2. కుక్కర్ ఆఫ్ చేసి మూడు నాలుగు సార్లు విజిల్ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత మంట తగ్గించి మరో ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించాలి.
  3. బాణలిలో చెంచా ఆవనూనె వేడి చేసి అందులో కొబ్బరి ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
  4. అదే బాణలిలో చెంచా నూనె వేడి చేయాలి. జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, అల్లం, దాల్చినచెక్క వేసి వేయించాలి.
  5. కొన్ని సెకన్ల పాటు వేగాక, ఉడికించుకున్న పప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. ఉప్పు రుచికి తగ్గట్లు చూసుకోండి. పప్పును కొన్ని నిమిషాలు అన్నీ కలిసేలా ఉడికించండి. అంతే.. బెంగాళీ దాల్ రెడీ.

2. దాల్ బంజారా:

కావలసిన పదార్థాలు:

• పొట్టు మినప్పప్పు: 3/4 కప్పు

• శనగపప్పు: 1/4 కప్పు

• తురిమిన అల్లం: 1 చెంచాడు

• పచ్చిమిర్చి: 1

• సన్నగా తరిగిన టొమాటో: 1

• బిర్యానీ ఆకు: 1

• దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క

• పసుపు: 1 టీస్పూన్

• గరం మసాలా పొడి: 1 టీస్పూన్

• సన్నగా తరిగిన కొత్తిమీర: పావు కప్పు

• నెయ్యి: 1 టీస్పూన్

• జీలకర్ర: 1 టీస్పూన్

తయారుచేసే విధానం:

  1. కుక్కర్ లో మినప్పప్పు, శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, టొమాటోలు, దాల్చిన చెక్క, పసుపు, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.
  2. కుక్కర్ లో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి రెండు మూడు విజిల్స్ రానివ్వాలి. మూడు విజిల్స్ వచ్చాక మంట తగ్గించి పప్పును మరో పది నిమిషాలు ఉడికించాలి.
  3. ఉప్పు, మసాలాలను ఒకసారి సరిచూసుకోండి. ఇప్పుడు పప్పు కోసం తాలింపు సిద్ధం చేయండి.
  4. చిన్న బాణలిలో నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. జీలకర్ర వేగాక స్టవ్ కట్టేసి సిద్ధం చేసిన తాలింపును పప్పులో పోయాలి. కొత్తిమీరతో పప్పును గార్నిష్ చేసి రోటీ, అన్నంతో సర్వ్ చేసుకోండి.

3. సింధీ దాల్:

కావలసిన పదార్థాలు:

• కంది పప్పు: 1 కప్పు

• సన్నగా తరిగిన టమోటాలు: 1 కప్పు

• మధ్య నుండి కట్ చేసిన పచ్చిమిర్చి: 2

• సన్నగా తరిగిన అల్లం – 1 టీస్పూన్

• చింతపండు గుజ్జు: 2 చెంచాలు

• పసుపు: 1/2 టీస్పూన్

• సన్నగా తరిగిన కొత్తిమీర: 2 టీస్పూన్లు

• ఉప్పు: రుచికి తగినంత

• నెయ్యి: 1 టీస్పూన్

• జీలకర్ర: 1 టీస్పూన్

• మెంతులు: 1/2 టీస్పూన్

• సన్నగా తరిగిన వెల్లుల్లి: 2 చెంచాలు

• ఎండుమిర్చి: 2

తయారీ విధానం:

  1. కందిపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. కుక్కర్ లో పప్పు, టమోటాలు, అల్లం, ఉప్పు, పసుపు, రెండు కప్పుల నీళ్లు పోయాలి.
  2. మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. పప్పు గుత్తితో బాగా కలపాలి.
  3. ఇప్పుడు ఈ పప్పును ఒక పాన్ లో వేయాలి. పచ్చిమిర్చి ముక్కలు, చింత పండు గుజ్జు, కప్పు నీళ్లు పోసి కలపాలి. దీన్ని తక్కువ మంట మీద పది నిమిషాలు ఉడికించి గ్యాస్ కట్టేయాలి.
  4. చిన్న తడ్కా ప్యాన్ తీసుకుని నెయ్యి వేడి చేసి జీలకర్ర, మెంతులు వేయాలి. తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చివర్లో ఎండుమిర్చి పొడి వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి.
  5. తయారు చేసిన సింధీ పప్పులో తాలింపు కలుపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024