Best Web Hosting Provider In India 2024
German silver: జర్మన్ సిల్వర్‌లో వెండి శాతం ఎంత ఉంటుంది? పూర్తి వివరాలివే..
జర్మన్ సిల్వర్ గురించి మీకూ సందేహాలున్నాయా? దాని గురించి, వాడకం గురించి, దాంట్లో వెండి శాతం గురించి వివరంగా తెల్సుకోండి.
జర్మన్ సిల్వర్ గురించి చాలా అనుమానాలుంటాయి. చూడ్డానికి అచ్చం వెండి లాగే ధగధగలాడుతూ ఉండటమే దానికి కారణం. వెండి వస్తువులను తరచూ వాడలేక చాలా మంది జర్మన్ సిల్వర్ తో చేసినవే రోజూవారీ వాడుతున్నారు. హారతి పల్లెం నుంచి, దేవుడి ఫొటోలు, చెంచాలు కూడా వీటితో చేసినవే వాడేస్తున్నారు. రిటర్న్ గిఫ్టులుగా, గిఫ్టులుగా కూడా ఈ మెటల్ వాడకం ఎక్కువయ్యింది. అయితే జర్మన్ సిల్వర్ విషయంలో కొన్ని ప్రశ్నలు మాత్రం అందరికీ ఉండేవే. దాన్ని దేంతో తయారు చేస్తారు? దీంట్లో వెండి శాతం ఏమైనా ఉంటుందా? అది వెండిలాగా ఎందుకు మెరుస్తుంది? లాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. వీటన్నింటికీ వివరంగా సమాధానం తెల్సుకోండి.
జర్మన్ సిల్వర్ లో వెండి ఉంటుందా?
ఇందులో వెండి శాతం సున్న. వెండిలాగా మెరుస్తుందని దానికాపేరుంది అంతే. జర్మన్ సిల్వర్‌ను కాపర్, జింక్, నికెల్ మెటల్స్ సమ్మేళనంతో మాత్రమే ఉంటాయి. 18 శతాబ్దం నుంచే దీని వాడకం మొదలైంది. దీంట్లో 50% – 61.6% కాపర్, 17- 19% జింక్, 20 నుంచి 30 శాతం మధ్యలో నికెల్ ఉంటుంది. వీటి శాతం అవసరాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు కూడా. జర్మనీకి చెందిన మెటల్ వర్కర్లు ఈ జర్మనీ సిల్వర్‌ను తయారు చేశారు చూడ్డానికి వెండిలా మెరుస్తూ ఉండటం వల్ల దీని పేరులో సిల్వర్ అనే పదం, జర్మన్ లో తయారు చేయడం చేత జర్మన్ అనే పదం చేరాయి. మొత్తానికి దీని పేరు జర్మన్ సిల్వర్ అయ్యింది. వెండి ధర ఎక్కువగా ఉండటం చేత దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని అవసరాల కోసం జర్మన్ సిల్వర్ వాడకం మొదలైంది. దీంట్లో నికెల్ శాతం ఉండటం వల్ల దాన్ని నికెల్ సిల్వర్ అనీ అంటారు.
జర్మన్ సిల్వర్ ఎలా గుర్తుపట్టాలి?
వెండి కన్నా వీటి బరువు తక్కువగా ఉంటుంది.
తుప్పు లాంటి సమస్యలుండవు
చాలా గట్టిగా ఉంటుంది.
ధర తక్కువ.
జర్మన్ సిల్వర్ వాడకం:
చిన్న చిన్న చెంచాల నుంచి మొదలై పెద్ద పెద్ద విగ్రహాల దాకా జర్మన్ సిల్వర్ వస్తువులు దొరుకుతున్నాయి. బహుమతులుగా ఇవ్వడానికి, ఆభరణాలు, పూజా వస్తువులు, దేవతా విగ్రహాలు, ఫ్రేములు.. ఇలా చాలా వస్తువుల్లో జర్మన్ సిల్వర్ వాడుతున్నారు. వంద రూపాయల్లోనూ, అంతకంటే తక్కువకే కూడా జర్మన్ సిల్వర్ వస్తువులు దొరుకుతాయి. గ్లాసులు, ప్లేట్లు, ట్రేలు, ఫోర్కులు, చెంచాలు, ఆభరణాలు, కీచైన్లు, కొన్ని సంగీత సాధనాల్లోనూ వీటి వాడకం మొదలైంది. చెంచాల్లాంటి చిన్న వస్తువులు యాభై రూపాయల్లోనూ దొరికేస్తాయి.
ఎలా వాడుకోవాలి?
వెండి లాగా ఇవి ఆక్సీకరణం చెంది తొందరగా నలుపెక్కవు. దాంతో పోలిస్తే ఎక్కువ రోజులు శుభ్రం చేయకపోయినా వీటి మెరుపు అలాగే ఉంటుంది. తుప్పు కూడా పట్టవు. వీటితో చేసిన జర్మన్ సిల్వర్ ఆభరణాలకూ ఇప్పుడు ప్రాముఖ్యత పెరిగింది. వాటిని మాత్రం ఎక్కువ చెమట, పర్ఫ్యూమ్స్ వాడినప్పుడు వేసుకోకుంటే సరి. గాలి చొరని డబ్బాలో భద్రపరిస్తే ఎంతకాలం అయినా మెరుపు తగ్గవు. జర్మన్ సిల్వర్ వస్తువులను శుభ్రం చేయడానికి టూత్ పౌడర్ వాడితే సరిపోతుంది. ఆ పౌడర్ రాసి, సాఫ్ట్ బ్రష్ వాడి రుద్దితే చాలు. నలుపేమైనా ఉంటే సులువుగా వదిలిపోతుంది.
టాపిక్