Best Web Hosting Provider In India 2024
రాఖీ పండగ రోజు సోదరుడి నోరు తీపి చేయడానికి ప్రత్యేకంగా ఏదైనా స్వీట్ ఉండాల్సిందే. ఇంట్లోనే ఇలా మలాయీ మాల్పువా చేశారంటే అందరికీ నచ్చేస్తుంది. మలాయీ మాల్పువా అంటే అరిసెల్లాంటి పూరీలను రబ్డీ, పంచదార పాకంతో సర్వ్ చేస్తారు. వీటి రుచి తినేటప్పుడు చివర్లో క్రిస్పీగా, మధ్యలో మెత్తగా, తియ్యగా బాగుంటుంది.
మలాయీ మాల్పువా తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు మైదా
పావు చెంచా యాలకుల పొడి
1/8 చెంచా బేకింగ్ సోడా
100 గ్రాముల కోవా
3 చెంచాల పెరుగు
1 కప్పు నెయ్యి
సగం కప్పు పంచదార
పావు కప్పు నీళ్లు
రబ్డీ కోసం:
1 లీటర్ పాలు
4 చెంచాల పంచదార
సగం చెంచా యాలకుల పొడి
చిటికెడు కుంకుమ పువ్వు
1 చెంచా రోజ్ వాటర్
2 చెంచాల బాదాం తరుగు
2 చెంచాల పిస్తా తరుగు
పంచదార పాకం కోసం:
1 కప్పు పంచదార
సగం కప్పు నీళ్లు
మలాయీ మాల్పువా తయారీ విధానం:
- ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మైదా వేసుకోవాలి. అందులో యాలకుల పొడి, బేకింగ్ సోడా, పంచదార కలుపుకోవాలి.
- కోవా కూడా వేసుకుని అన్నీ ఒకసారి పొడిపొడిగా కలుపుకోవాలి. పెరుగు కూడా వేసుకోవాలి. పుల్లగా లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కోవాకు బదులుగా పాలపొడి కూడా వాడుకోవచ్చు.
- ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిలో ఉండల్లేకుండా కలుపుకోవాలి.
- మూత పెట్టి పిండిని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పంచదార పాకం కోసం తయారీ చేసుకోవాలి. ముందుగా నీళ్లలో పంచదారను కలుపుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి.
- తీగ పాకం వచ్చేంత వరకు పంచదార పాకం వేడి చేయాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లబడితే గట్టిగా అయిపోతుంది. అందుకే వేడి నీళ్లు చేసి అందులో ఈ పాకం ఉన్న పాత్ర పెట్టాలి.
- ఇప్పుడు మాల్పువా తయారీ కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేసుకుని వేడి చేయాలి.
- మంట సన్నంగా పెట్టుకుని రెండు చెంచాల పిండిని తీసుకుని వేడి నెయ్యిలో పోసుకోవాలి.
- నెయ్యిలో వీటిని బాగా ఫ్రై చేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చి క్రిస్పీగా అయ్యాక మరోవైపు కూడా వేయించాలి.
- వీటిని వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసేయాలి. పాకం అంతా పీల్చుకునేలాగా వీటిని వేయాలి.
- రబ్డీ తయారీ కోసం పాలను అడుగు మందంగా ఉన్న పాత్రలో పోసుకోవాలి. చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సగానికి అయ్యాక అందులో పంచదార పోసుకోవాలి. కుంకుమ పువ్వు, యాలకుల పొడి కూడా వేసుకోవాలి.
- బాగా మరిగి చిక్కపడితే రబ్డీ రెడీ అయినట్లే. అందులో రోజ్ వాటర్ కలిపేసుకుని దింపేయాలి.
- వీటిని సర్వ్ చేసుకోడానికి ఒక పల్లెంలోకి తీసుకోవాలి. మీద పంచదార పాకం కాస్త పోయాలి. తర్వాత సిద్దం చేసుకున్న రబ్డీ, పిస్తా, బాదాం ముక్కలు కూడా వేసుకుని సర్వ్ చేశారంటే చాలా రుచిగా ఉంటాయి.