Arukonda Rajesh: అమెరికాలో ఓరుగల్లు వాసి మృతి.. డెడ్ బాడీ కోసం రాజేష్ తల్లి ఆరాటం

Best Web Hosting Provider In India 2024


హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుకొండ నీలమ్మ, సాంబయ్య దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు ఏరుకొండ రాజేష్ (32) కొంత కాలం కిందట ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని మిస్సిస్సిపి రాష్ట్రానికి వెళ్లాడు. చదువులు పూర్తి చేసి ఇప్పుడు అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా కొద్ది రోజుల కిందట రాజేష్ కాలికి గాయమైంది. దీంతో దానికి సంబంధించిన చికిత్స తీసుకున్న రాజేష్ అదే విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. ఇంతలోనే ఏం జరిగిందో కానీ రాజేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఇదే విషయాన్ని అతడి స్నేహితులు మూడు రోజుల కిందట రాజేష్ తల్లి ఏరుకొండ నీలమ్మకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.

ఏడాది కిందట తండ్రి మరణం..

2015లో అమెరికా వెళ్లిన రాజేష్ అక్కడే ఉంటుండగా.. అతడి తండ్రి సాంబయ్య ఏడాది కిందట అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. దీంతో దహన సంస్కారాలు పూర్తి చేసేందుకు రాజేష్ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన అనంతరం తిరిగి అమెరికా ప్రయాణం అయ్యాడు. తొందర్లోనే తిరిగి వస్తానని తన తల్లితో పాటు ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి వెళ్లి పోయాడు. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఆత్మకూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది.

మృతదేహం కోసం ఎదురుచూపులు..

తండ్రి సాంబయ్య మరణం తరువాత తల్లి నీలమ్మ నర్సంపేటలోని తన కుమార్తె ఇంటి వద్దనే ఉంటోంది. తొందర్లోనే ఇంటికి వచ్చేస్తానని మాట ఇచ్చిన కొడుకు.. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే తన కొడుకు మరణించాడన్న వార్త తెలుసుకున్న తల్లి నీలమ్మ కన్నీరుమున్నీరవుతోంది. తన కొడుకు మృత దేహాన్ని ఇంటికి తీసుకువచ్చే మార్గం తెలియక తల్లడిల్లిపోతోంది. ప్రభుత్వం స్పందించి రాజేష్ మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని నీలమ్మ వేడుకుంటోంది.

స్పందించిన ఎమ్మెల్యే రేవూరి..

అమెరికాలో ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ మృతి విషయం తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేష్ కుటుంబ సభ్యులతో శనివారం ఉదయం ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని, మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. మృతదేహాన్ని ఆత్మకూరు తీసుకొచ్చేందుకు తన వంతుగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు సీఎం ఆఫీస్ సిబ్బందితో ఫోన్ లో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)

టాపిక్

UsWarangalTelangana NewsCm Revanth Reddy

Source / Credits

Best Web Hosting Provider In India 2024