Ramagundam Robbery : సినీఫక్కీలో కారులోంచి రూ.28 లక్షలు చోరీ, మాజీ డ్రైవరే అసలు సూత్రధారి

Best Web Hosting Provider In India 2024


Ramagundam Robbery : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లిలో సినీ ఫక్కీలో కారులో నుంచి రూ.28 లక్షలు అపహరించిన నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఆ కారు మాజీ డ్రైవర్ ప్రధాన నిందితుడు కావడం విశేషం. పట్టుబడ్డ వారి నుంచి రూ.24 లక్షల నగదుతో పాటు రెండు బైక్ లు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ శ్రీనివాస్ సమక్షంలో అరెస్టు అయిన నలుగురు నిందితులను చూపించి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు వెల్లడించారు. ఈనెల 17న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్ హోటల్ పక్కన పార్కింగ్ చేసిన కారు నుంచి 28 లక్షల రూపాయలు గల బ్యాగ్ చోరీకి గురయ్యింది.‌ ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి నకిలీ కీ తో కారు డోర్ తెరిచి క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లారు. బాధితుడు హైదరాబాద్ కు చెందిన వ్యాపారి బిపిన్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీపీ శ్రీనివాస్ ఆదేశాలతో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. నిందితులు ప్రయాణించిన మార్గాలలో సీసీ కెమెరాల పుటేజ్ లను పరిశిలించి వాటి ఆధారంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి నలుగురిని పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.

కారు మాజీ డ్రైవరే సూత్రధారి

వ్యాపారి వద్ద డ్రైవర్ గా పని చేసిన హైదరాబాద్ భరత్ నగర్ కు చెందిన పటాలవత్ దాసు ఈ చోరీకి సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. వ్యాపారి డబ్బు వసుళ్లకు వెళ్లి భారీ మొత్తంలో నగదు వసూలు చేసుకుని రావడం గమనించిన డ్రైవర్ దాసు పథకం ప్రకారం కారు నకిలీ కీ తయారు చేయించుకున్నాడు. దుర్బుద్ధితో వ్యాపారి వద్ద డ్రైవర్ గా పని చేయడం మానేశాడు. వ్యాపారి కదలికలను గమనించి యథావిధిగా వ్యాపారి కారులో పెట్టే క్యాష్ బ్యాగ్ ను కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రులైన అత్తాపూర్ లో నివాసం ఉండే పోతలు శివ, ముప్పూరు రాజు, పండుగ రాజులను కలుపుకున్నాడు. ఈనెల16న వ్యాపారి కారులో హైదరాబాద్ నుంచి బయలు దేరింది తెలుసుకుని అదే రోజు రాత్రి మంచిర్యాలలో కలెక్షన్ కి వచ్చిన వారు తరచు బస చేసే లాడ్జికి దగ్గరలోని గుడిలో నలుగురు ఉన్నారు.

మరుసటి ఇద్దరిద్దరుగా రెండు బైక్ లపై డబ్బులున్న కారును వెంబడిస్తూ బెల్లంపల్లిలో టిఫిన్ సెంటర్ ముందు కారు నిలిపి ఉంచగా దాసు, శివ బైక్ పై హెల్మెట్ మాస్క్ ధరించి వచ్చి వారి వద్ద ఉన్న నకిలీ కీ తో కారు డోర్ ఓపెన్ చేసి కలెక్షన్ క్యాష్ ఉన్న బ్యాగ్ ను అపహరించారు. పాతబెల్లంపల్లి శివార్లలో గల అడవిలో తలదాచుకున్నారు. కారులో నుంచి క్యాష్ బ్యాగ్ పోయిందని వ్యాపారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేపట్టగా నలుగురు పట్టుబడ్డారు.‌ దాసు వద్ద నుంచి 9 లక్షలు సెల్ ఫోన్, శివ వద్ద నుంచి 8 లక్షలు, సెల్ ఫోన్ పల్సర్ బైక్, ముప్పురు రాజు వద్ద నుంచి 4 లక్షలు సెల్ ఫోన్, బైక్, పండుగ రాజు వద్ద నుంచి 3 లక్షల రూపాయలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సీపీ ప్రకటించారు.

భారీ చోరీని 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, కానిస్టేబుల్ ఐ.మల్లేశం, మంచిర్యాల సీసీఎస్ కానిస్టేబుల్స్ సతీష్, శ్రీనివాస్ లను సీపీ శ్రీనివాస్ అభినందించి క్యాష్ రివార్డ్ అందజేశారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsRamagundamCrime Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024