Best Web Hosting Provider In India 2024
Atchutapuram Accident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృత్యుల సంఖ్య 16కు పెరిగింది. బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో కార్మికులకు గాయపడ్డారు. గాయపడిన వారి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సుమారు 1:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రుల తరలింపునకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ వాడాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు రేపు(గురువారం) అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఎసెన్షియా పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించనున్నారు. అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడనున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విశాఖ లేదా హైదరాబాద్ తలించాలని ఆదేశించారు.
మృతుల వివరాలు
ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో 10 మందిని గుర్తించారు. వారి వివరాలు…వి. సన్యాసినాయుడు(ప్లాంట్ ఏజీఎం), రామిరెడ్డి(ల్యాబ్ హెడ్),హారిక (కెమిస్ట్), పార్థసారథి(ప్రొడక్షన్ ఆపరేటర్), వై. చిన్నారావు(ప్లాంట్ హెల్పర్), మోహన్(ఆపరేటర్), గణేష్(ఆపరేటర్), పి.రాజశేఖర్, హెచ్. ప్రశాంత్, ఎం. నారాయణరావు. మరో ఆరుగురిని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కంపెనీ నిర్వాహకులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టాపిక్