Best Web Hosting Provider In India 2024
RGV Horror Movie: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో హారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. కేవలం హారర్ లేదంటే హారర్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధిస్తున్నాయి. సైతాన్, ముంజ్యా, ఈ మధ్యే స్త్రీ2 మూవీస్ అదే నిరూపించాయి. ఇక తాజాగా డీమాంటే కాలనీ 2 కూడా వస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఒకప్పుడు తన హారర్ సినిమాలతో భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.
భూత్ మూవీ అపార్ట్‌మెంట్ ఇప్పటికీ అలాగే..
రామ్ గోపాల్ వర్మ కెరీర్లోనూ కొన్ని హిట్ హారర్ సినిమాలు ఉన్నాయి. రాత్రి, దెయ్యం, భూత్, డర్నా మనా హై, ఫూంక్ లాంటి హారర్ మూవీస్ ను అతడు తీశాడు. అయితే వీటిలో 2004లో వచ్చిన భూత్ మాత్రం పెద్ద హిట్ గా నిలిచింది. అజయ్ దేవగన్, ఊర్మిళ నటించిన ఆ సినిమా వణికించింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ మూవీ వచ్చి 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ మూవీ తీసిన అపార్ట్‌మెంట్ ఎవరూ కొనలేదట.
ఈ విషయాన్ని ఆర్జీవీయే చెప్పాడు. హైదరాబాద్ లో బుధవారం (ఆగస్ట్ 21) డీమాంటే కాలనీ 2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అతడు ఈ విషయం వెల్లడించాడు. “ఇప్పుడే డైరెక్టర్ అజయ్ తో మాట్లాడాను. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. నేను 2004లో భూత్ సినిమా తీశాను. ఇప్పటికే 20 ఏళ్లవుతోంది. కానీ ఆ సినిమా తీసిన అపార్ట్‌మెంట్ ఇప్పటి వరకూ ఎవరూ తీసుకోలేదు. ఆ సినిమాకు అలాంటి పేరు వచ్చింది. ఇప్పుడు డీమాంటే కాలనీని కూడా ఖాళీ చేసి వెళ్లిపోతారేమో చూడాలి. మొదటి పార్ట్ తీసినప్పుడే ఆ పేరు పెట్టినందుకు వివాదం తలెత్తిందట” అని ఆర్జీవీ అన్నాడు.
1990ల్లో ఆర్జీవీ.. శివ, క్షణక్షణం, మనీ, సత్య, రంగీలాలాంటి భిన్నమైన జానర్ల సినిమాలతోపాటు రాత్రి, దెయ్యం, కౌన్ లాంటి హారర్ సినిమాలతోనూ భయపెట్టాడు. అయితే వీటన్నింటికన్నా భూత్ మూవీ హైలైట్ గా నిలిచింది.
డీమాంటే కాలనీ 2 మూవీ గురించి..
ఈ భూత్ మూవీ తెలుగులో 12వ అంతస్తు పేరుతో రిలీజైంది. ఆ సినిమాలో కేవలం సౌండ్స్ తోనే రామ్ గోపాల్ వర్మ భయపెట్టిన తీరు హైలైట్ అని చెప్పాలి. అలాంటి వర్మ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న మరో హారర్ మూవీ డీమాంటే కాలనీ 2పై మాట్లాడటం విశేషం. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ మూవీకి మంచి రిపోర్టులు వస్తున్నాయని, తాను కూడా చూస్తానని చెప్పాడు.
డీమాంటే కాలనీ 2 మూవీ శుక్రవారం (ఆగస్ట్ 23) రిలీజ్ కాబోతోంది. తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ కానున్న ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. గతంలో వచ్చిన డీమాంటే కాలనీ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. ప్రియా భవానీ శంకర్ ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits