Krishna temples: హైదరాబాద్‌లో కృష్ణాష్టమి రోజు దర్శించదగ్గ ప్రముఖ కృష్టాలయాలివే

Best Web Hosting Provider In India 2024


ఆగస్టు 26, సోమవారం రోజున కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. ఈ రోజు తప్పకుండా కృష్ణాలయాన్ని సందర్శించాల్సిందే. ఆ చిన్ని కృష్ణునికి ప్రత్యేక పూజలు ఆలయాల్లో నిర్వహిస్తారు. ఈ శ్రీ కృష్ణాష్టమి రోజున హైదరాబాద్‌లో తప్పకుండా సందర్శించదగ్గ కృష్ణాలయాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆలయాలేంటో, అవి ఎక్కడెక్కడున్నాయో వివరాలన్నీ తెల్సుకోండి.

1. శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్

ఈ ఆలయం బంజారా హిల్స్‌లో ఉంది. ఇది ఆ జగన్నాథుని ఆలయం. రెడ్ స్యాండ్‌స్టోన్ తో కట్టిన ఈ ఆలయ నిర్మాణం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పూరీ లోని జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుందీ గుడి. ఆ ఆలయంలోనూ ఒడిశా లోని పూరీ జగన్నాథ్ ఆలయం లాగే తోబుట్టువులైనా సుభద్ర, బలరాములతో శ్రీ కృష్ణుడు కొలువై ఉన్నాడు.  ఒడియా కమ్యునిటీ ఈ కృష్ణాలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ శిఖరం 70 అడుగుల ఎత్తులో ఉండి మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.

2. ఇస్కాన్ టెంపుల్

భాగ్యనగరం మధ్యలో ఉన్న అబిడ్స్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేంది అక్కడి ఇస్కాన్ టెంపుల్. అబిడ్స్ లో ఉన్న ఇస్కాన్ శ్రీ రాధా మదన్ మోహన మందిరం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఇక్కడ నిరంతరం కృష్ణారాధన ప్రత్యేకంగా జరుగుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్టు 26 వ తేదీన మహాభిషేకాలు, మహా ప్రసాద వితరణ, హారతులు ప్రత్యేకంగా జరుగుతాయి. కృష్ణాష్టమి రోజున తప్పకుండా దర్శించాల్సిన గుళ్లలో ఇదీ ఒకటి.

3. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్

ఈ ఆలయాన్ని 2018లో నిర్మించారు. బంగారు హంగుల్లో ఈ ఆలయం మెరిసిపోతుంది. రాత్రి పూట అయితే ఈ ఆలయ కళ మరింత రెట్టింపు అవుతుంది. ఈ ఆలయంలో శ్రీ శ్రీ రాధ గోవింద, లక్ష్మీ నరంసింహ స్వామి కొలువై ఉన్నారు. ఇద్దరికీ ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ఈ ఆలయం వీక్షిస్తే మరిన్ని ప్రత్యేకతలు తెల్సుకోవచ్చు. నిత్య హారతులు, పూజలతో ఆలయం శోభాయమానంగా ఉంటుంది. ఈ ఆలయం బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో కొలువై ఉంది. 

4. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం

కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని గోవర్దన గిరి మీద కొలువై ఉంది ఈ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ శ్రీ కృష్ణ ఆలయంలో సతీసమేతంగా కొలువై ఉన్నాడు.  రుక్మిణీ దేవి, సత్యభామ దేవీ, గోదా దేవి ఆలయాలూ ఉన్నాయి. ఇక్కడే ఆలయం పక్కన గోశాల కూడా ఉంది. ఈ ఆలయానికి వెళ్లే దారి కూడా ప్రకృతి అందాలతో అలరిస్తుంది. పిల్లలతో కలిసి కూడా వెళ్లదగ్గ ప్రశాంత వాతావరణం ఈ ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. ఒకసారి తప్పక వీక్షించండి. 

 

 

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024