Best Web Hosting Provider In India 2024
కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని భర్త చెప్పడంతో అలిగిన ఆ మహిళ, అతడిపై వెధింపుల కేసు పెట్టింది. కాగా ఈ విషయంపై పోలీసుల దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇదీ జరిగింది..
సదరు మహిళ ఐపీసీ సెక్షన్ 498ఏ, 504, వరకట్న నిషేధ చట్టం కింద భర్తపై ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ వ్యక్తిపై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అమెరికాలో వర్క్ చేసే అతడిని విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు.
ఈ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. తిరిగి అమెరికా వెళ్లాలన్న భర్త అభ్యర్థనను జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆమోదించారు. సెప్టెంబర్ 21న తదుపరి విచారణ వరకు ఎల్ఓసీపై స్టే విధించిన ఆయన అఫిడవిట్ని సమీక్షించిన తర్వాత మహిళ భర్తను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించారు. భవిష్యత్ విచారణకు అందుబాటులో ఉంటానని తన అఫిడవిట్లో ఆ వ్యక్తి హామీ ఇచ్చినట్టు న్యాయమూర్తి గుర్తించారు.
ప్రసవం తర్వాత అధిక రక్తపోటును ఎదుర్కొన్నప్పుడు, బరువు పెరుగుతానేమో అన్న ఉద్దేశంతో తన భర్త, తనని ఫ్రెంచ్ ఫ్రైస్, అన్నం, మాంసం తినకుండా అడ్డుకున్నట్టు సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు డెలివరీ తర్వాత తన భార్య ఇంటిని పట్టించుకోవడం లేదని ఆ వ్యక్తి అన్నాడు. ఇంటి పనులు, రోజువారీ పనులకు తాను మాత్రమే బాధ్యత వహిస్తున్నట్టు, తన భార్య ఎక్కువ సమయం టీవీ చూడటం, ఫోన్స్ చేయడంలో గడుపుతోందంటూ భర్త కోర్టుకు తెలిపాడు.
ఐపీసీ సెక్షన్ 498ఏలో చెప్పినట్టు ఇక్కడ నేరం జరిగిన ఆధారాలు లేవని జస్టిస్ నాగప్రసన్న తన తీర్పులో పేర్కొన్నారు. దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన నొక్కి చెప్పారు. దీంతో ట్రావెల్ అరేంజ్మెంట్ గురించి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు తెలియజేయాలని, భర్తకు ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేకుండా చూడాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
“ఇలాంటి చిన్న పరిస్థితుల్లో పోలీసులు ఎల్ఓసీ జనరేట్ చేసి భర్తకు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది పోలీసులు అధికార దుర్వినియోగం కాదు. ఫిర్యాదు చేసిన మహిళ కోరిక మేరకు చట్టాలను దుర్వినియోగించడం. ఎల్ఓసీ జారీ చేసేంత నేరం ఇక్కడ జరగలేదు. తన భర్త అమెరికాలోని ఉద్యోగానికి తిరిగి వెళ్లకుండా అడ్డుకోవడమే పిటిషనర్ ఉద్దేశంగా కనిపిస్తోంది,’ అని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని చెప్పినందుకు, భర్తపై మహిళ వెధింపుల కేసు పెట్టినట్టు తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link