YSR Name: కొత్త మెడిక‌ల్ కాలేజీల‌కు వైఎస్ఆర్ పేరు తొల‌గింపు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

Best Web Hosting Provider In India 2024


ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాలలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగిస్తూ.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. 2023-24లో ప్రారంభమైన ఐదు, 2024-25లో ప్రారంభంకానున్న మరో ఐదు వైద్య కళాశాలలు, పలాసలోని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కడపలోని క్యాన్సర్ కేర్ సెంట‌ర్‌కీ వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు జీవోఎంఎస్ 103 పేరుతో ఉత్తర్వులు జారీచేశారు.

మొద‌టి ద‌శ‌లోని విజ‌య‌న‌గ‌రం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడిక‌ల్ కాలేజీలు.. రెండో ద‌శ‌లోని అధోని, పులివెందుల‌, మార్కాపురం, పాడేరు, మ‌ద‌న‌ప‌ల్లి మెడిక‌ల్ కాలేజీల పేర్లులో వైఎస్ఆర్ పేరును తొల‌గించారు. పలు ఆస్పత్రులకు కూడా వైఎస్ఆర్‌ పేరును తొలిగించి ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్ప‌టల్స్‌గా మార్చారు. ఇక నుంచి ఆయా ప్రాంతాల పేర్ల‌తో.. ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్ప‌టల్‌గా పిలుస్తారు.

పలాసలోని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను, కడపలోని వైఎస్ఆర్‌ క్యాన్సర్ కేర్ సెంట‌ర్‌లో.. వైఎస్ఆర్ పేరును తొల‌గించారు. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌, ప‌లాస‌.. క్యాన్సర్ కేర్ సెంట‌ర్‌ క‌డ‌ప అని మార్చారు. టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత.. పేర్లు మార్పు అనేది సర్వసాధారణం అయిపోయింది.

తొలిత సామాజిక పెన్ష‌న్ పేరును మార్చారు. వైఎస్ఆర్ పేరును తొల‌గించి, ఎన్‌టీఆర్ పేరును పెట్టారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోష‌ణ ప‌థ‌కం, సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్ ప‌థ‌కాల పేర్ల‌ను బాల సంజీవ‌నిగా మార్చారు. దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను మ‌హిళా పోలీస్ స్టేష‌న్ల‌గా పేరు మార్చారు. విద్యా రంగంలోని ప‌థ‌కాల పేర్లను కూడా మార్చారు. జగనన్న అమ్మఒడి ప‌థ‌కాన్ని త‌ల్లికి వంద‌నం, జ‌గ‌న‌న్న విద్యా కానుకను స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విద్యార్థి మిత్ర‌, జ‌గ‌న‌న్న గోరుముద్దను డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నం, మ‌న‌బ‌డి నాడు-నేడును మ‌న‌బ‌డి-మ‌న భ‌విష్య‌త్తు, స్వేచ్ఛను బాలికా ర‌క్ష‌, జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు పథకాన్ని.. అబ్దుల్ క‌లాం ప్ర‌తిభా పుర‌స్కారంగానూ మార్చారు.

జ‌గ‌నన్న విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన ప‌థ‌కాల పేర్ల‌ను పోస్ట్ మెట్రిక్ స్కాల‌ల్ షిప్‌గా మార్చారు. ఎస్‌సీల‌కు అమ‌ల‌వుతున్న జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కాన్ని అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ విద్యా నిధిగా మార్చారు. వైఎస్ఆర్ క‌ళ్యాణమ‌స్తు పేరును చంద్ర‌న్న పెళ్లికానుక‌గా, వైఎస్ఆర్ విద్యోన్న‌తి ప‌థ‌కం పేరును ఎన్‌టీఆర్ విద్యోన్న‌తిగా మార్చారు. జ‌గ‌న‌న్న సివిల్ స‌ర్వీసెస్ ప్రోత్సాహ‌కం పేరును.. ఇన్‌సెంటివ్స్ ఫ‌ర్ సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ప్రోత్స‌హాకాలు)గా కూట‌మి ప్ర‌భుత్వం మార్చింది.

అసంఘ‌టిత రంగంలోని కార్మికుల‌కు అందించే బీమా పేరును చంద్ర‌న్న బీమాగా పున‌రుద్ధ‌రించారు. వైఎస్ఆర్ వ్య‌వ‌సాయ ఉచిత విద్యుత్ ప‌థ‌కం పేరును ఏపీ ఉచిత వ్య‌వ‌సాయ విద్యుత్ ప‌థ‌కంగా మ‌ర్చారు. నీరుపారుద‌ల ప్రాజెక్టుల పేర్లను కూడా మార్చారు. వైఎస్ఆర్‌పీడీఎంపీ పేరును మార్చి.. గోదావ‌రి-పెన్నా అనుసంధానం తొలిద‌శ‌, వ‌రిక‌పుడిశెల ఎత్తిపోత‌లుగా మార్చారు. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని.. ముక్త్యాల ఎత్తిపోత‌ల ప‌థ‌కంగా.. వైఎస్ఆర్ వెలిగ‌ల్లు బ్చాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌ను.. స‌ర్వారాయ సాగ‌ర్‌గా.. న‌ల్ల‌పురెడ్డి శ్రీ‌నివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజీని నెల్లూరు బ్యారేజీగా, మేక‌పాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీని సంగం బ్యారేజీగా పేర్లు మార్చారు.

గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌ను తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌గా, అనంత వెంక‌ట‌రెడ్డి హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతిని హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతిగా మార్చారు. వైఎస్ఆర్ అప్ప‌ర్ పెన్నార్ ప్రాజెక్టును ప‌రిటాల ర‌వీంద్ర ఎత్తిపోత‌ల ప‌థ‌కంగా.. బూచేప‌ల్లి సుబ్బారెడ్డి మొగ‌లి గుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్‌ను.. మొగ‌లి గుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్‌గా.. రెకెట్ల నారాయ‌ణ రెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని రాకెట్ల ఆమిద్యాల ఎత్తిపోత‌ల ప‌థ‌కంగా మ‌ర్చారు. ఈ పేర్ల మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

టాపిక్

YsrcpAndhra Pradesh NewsGovernment Of Andhra Pradesh

Source / Credits

Best Web Hosting Provider In India 2024