Best Web Hosting Provider In India 2024
Chandrababu Naidu : అర్థ శతాబ్ది భారత రాజకీయ చరిత్ర పుస్తకంలో నారా చంద్రబాబు నాయుడొక చెరగని పుట! ఆయన రాజకీయ జీవితం నడుస్తున్న చరిత్ర. 29 ఏళ్ల కింద 1 సెప్టెంబర్, 1995, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అటుపై మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన బాబు, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ కు రెండో దఫా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. దేశంలో మరే రాజకీయ నాయకునికీ లేని విధంగా, వైవిధ్యభరిత అవకాశాలు, సవాళ్లు ఎదుర్కొన్న ఆయన దాదాపు పదిహేనేళ్లు విపక్ష నేతగా, సుమారు అంతే కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక పవన్ కుమార్ చామ్లింగ్ (సిక్కిం), ఒక జ్యోతిబసు (పశ్చిమబెంగాల్), నవీన్ పట్నాయక్ (ఒడిశా) లాగానో నిరవధికంగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి కాకపోయినా… రెండు కీలకమైన రాజకీయ బాధ్యతల్ని (ముఖ్యమంత్రి-విపక్షనేత) ముప్ఫై యేళ్లపాటు నిరవధికంగా కొనసాగిస్తున్న అనుభవశాలి బాబు. ఆయనొక విలక్షణ కేస్ స్టడీ! సుదీర్ఘ రాజకీయ పయణంలో ఎన్నో ఉత్థానపతనాలు! మంచికి పొగడ్తలు, చెడుకు తెగడ్తలు….అదొక వెలుగునీడల సయ్యాట!
నేరుగా ప్రజాతీర్పుతో కాకుండా, 1995లో ఓ ప్రత్యేక పరిస్థితిలో ముఖ్యమంత్రి పీఠమెక్కిన నారా చంద్రబాబు నాయుడుకు, ఆ క్రమంలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిరది. 1996, 1998లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్ని అందుకాయన అవకాశంగా మలచుకున్నారు. పార్టీ నేతగా తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి అవి ఆయనకు పనికొచ్చాయి. 1994 ఎన్నికల్లో ప్రజాతీర్పు, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన మామ ఎన్టీరామారావును పదవీచ్యుతుడ్ని చేసి, తెలుగుదేశం ప్రత్యామ్నాయ నాయకుడిగా చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ఆయనకు మద్దతుగా నిలిచిన వారు, ఈ ప్రక్రియను, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వంటి రాజ్యాంగేతర శక్తుల జోక్యాల నుంచి పార్టీని ‘కాపాడుకోవడం’గా అభివర్ణించారు. వ్యతిరేకులు మాత్రం… మామకు ‘వెన్నుపోటు’ పొడిచి, పార్టీనీ, ముఖ్యమంత్రి పీఠాన్నీ బాబు-ఆయన బృందం లాక్కున్నదనే విమర్శించారు.
1982 తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 27 యేళ్ల యుక్త వయసులోనే ఎమ్మెల్యే (1978) అయి, 30 యేళ్లకే మంత్రి (1981) పదవి చేపట్టి రాజకీయాలు నడుపుతున్నారు. 1983 ఎన్నికల్లో సొంత నియోజవర్గం చంద్రగిరి (చిత్తూరు) నుంచి ఓడిపోయి, కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న మామ ఎన్టీరామారావు నేతృత్వంలోని టీడీపీలోకి వచ్చారు. 1985లో ఎన్టీ రామారావును పదవీచ్యుతుడ్ని చేసి, నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి పీఠమెక్కినప్పుడు…. వచ్చిన తీవ్ర వ్యతిరేకత ప్రజాస్వామ్య పునరుద్దరణ ఉద్యమరూపుదాల్చింది. వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి వంటి ఇతర పక్షాల నాయకుల సహకారంతో దాన్ని నడపడంలో, ఎన్టీఆర్ ప్రభుత్వ పునఃప్రతిష్టలో కీలక నిర్వహణ పాత్ర పోషించిన చంద్రబాబు, తదనంతర ప్రభుత్వంలో ‘కర్షకపరిషత్’ ఛైర్మన్ అయ్యారు.
ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా అప్పట్నుంచే బాబు చక్రం తిప్పటం మొదలైంది. 1989లో పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత టీడీపీ విస్తరణలో, విపక్ష పాత్ర నిర్వహణలో క్రియాశీలంగా వ్యవహరించిన బాబు, 1994లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, రెవెన్యూ మంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అల్లుడిగా పలుకుబడి కలిగిన ఆయన చుట్టే, పార్టీ ముఖ్యనాయకులంతా చేరేది.
అవసరాన్ని బట్టి వ్యవహారం
సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని స్థూలంగా పరిశీలిస్తే నిలకడైన పంథాయే చంద్రబాబులో కనిపిస్తుంది. నలభై, ముప్ఫైయేళ్ల కింద ఎలా ఆలోచించేదో, ఏం వ్యూహాలు పన్నేదో, వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించేదో… దాదాపు ఇప్పుడూ ఆలాగే చేస్తుంటారు. అదే శక్తి, అదే ఉత్సాహం, అదే ఓరిమి, అదే పట్టుదల! కానీ, దేనికి అదిగా విడగొట్టి చూసినప్పుడు…. నిలకడ లేని, పొందిక కుదరని, పరస్పర విరుద్దమైన వైకరులు ఆయనలో కొట్టిచ్చినట్టు కనిపిస్తాయి. అందుకే, విశ్వసనీయత తక్కువ! సంస్కరణవాదని అంటారు, సంక్షేమంలో సంప్రదాయికంగా ఉంటారు. ప్రజాస్వామ్యవాదినంటారు, ఉదాసీనంగా ఉంటూ ఆయా సంస్థల్ని నిర్వీర్యపరుస్తారు. ఫాసిస్ట్ శక్తులతో పొత్తు పెట్టుకోనంటారు, మళ్లీ పెట్టుకుంటూ ఉంటారు. ఎన్నికల ముందు, నోటికి వచ్చిన ఏ హామీ అయినా ఇస్తారు, అధికారంలోకి రాగానే వాటిని మరచిపోతారు, లేదా అమలు పలుచన చేసి అబాసు పాలవుతారు.
ఆయా అంశాల్లో తనపై ప్రజల విశ్వాసాన్ని మించి, రాజకీయ వ్యూహ చతురతే ఆయన్ని పలుమార్లు ఎన్నికల్లో గెలిపించింది. ఆదేంటో గాని, ఒంటరిగా కాకుండా ఆయన ఇతర పార్టీలతో, ముఖ్యంగా బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడే గెలిచిన చరిత్ర! 1999లో బీజేపీతో పొత్తు, ఒక ఓటుతో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సానుభూతి పవనాల్లో వారితో పొత్తు ఆయనకు అనుకూలించింది. తిరుపతిలోని అలిపిరి వద్ద నక్సలైట్లు మందుపాతర పేల్చినప్పుడు, మృత్యుముఖంలోకి వెళ్లి వచ్చిన చంద్రబాబు, సానుభూతి పవనాలు సానుకూలిస్తాయనుకొని ఎన్నికల్ని 2004లో కాస్త ముందుకు జరిపారు. కానీ, తాను మునగడమే కాకుండా, తనతో జతకట్టిన బీజేపీనీ జాతీయ స్థాయిలో ముంచారని, జాతకాలు-జ్యోతిష్యాలు నమ్మే గిట్టనివారు ప్రచారం చేశారు.
2009 ఎన్నికలు వచ్చేటప్పటికీ, బీజేపీని కాదని టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో జతకట్టి, డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి నేతృత్వపు కాంగ్రెస్ తో పోటీపడి ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత, 2014లో తిరిగి బీజేపీతో కలిసి పోటీ చేసి, అవశేషాంధ్రప్రదేశ్ లో నెగ్గి, తొలి సర్కారును ఏర్పరిచారు. 2019లో వారితో విభేధించి, ఒంటరిగా పోయి బాబు ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ 2024లో బీజేపీ, జనసేనతో పొత్తుల్లో భారీ మెజారిటీతో నెగ్గి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలతో ఎప్పుడో ఒకప్పుడు పొత్తుపెట్టుకున్న చరిత్ర బాబుది.
ప్రమాదకారి మాత్రం కాదని
జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ (1996) రాజకీయాల్లో కీలకపాత్ర వహించిన చంద్రబాబు, ఒక దశలో… తనకు ప్రధాని పదవికి అవకాశం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దాన్ని వదులుకున్నాను అంటారు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి చేయడంలో తనదే ముఖ్య భూమిక అంటారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీని అభివృద్ది చేసిన తానే ఆధునిక హైదరాబాద్ ను ఆవిష్కర్తనంటారు. ఇంకా ఏమేమో అంటారు. కొందరు నమ్ముతారు, ఇంకొందరు నవ్వుకుంటారు. మీడియాను మచ్చిక చేసుకోవడంలో దిట్టగా పేరుంది. ‘ఏం తేడా వచ్చినా మీడియా ప్రతికూలంగా ప్రచారం చేస్తుంది, ప్రజలు ఏమనుకుంటారో? అంతిమంగా వారి మనసులో చెడు కావద్దు….’ ఇట్లాంటి భయాలుండేవి ఆయనకు. అందుకే, తాను నియంత్రణలో ఉండటమే కాక, తన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్ని నియంత్రణలో ఉంచేందుకు యత్నించేది.
సామాన్యుల సమస్యల్ని అంతగా పట్టించుకోకపోవడం, వ్యవసాయంలో పరిష్కారాలకు యత్నించకపోవడం, పేదరిక నిర్మూలనకు నిర్దిష్ట ఆలోచనలు లేకపోవడం ఆయనపై వ్యతిరేకతను పెంచింది. ‘మనసులో మాట’ పుస్తకం రాసి, తన మనోగతాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. అది తీవ్రి విమర్శల పాల్జేసింది. ముఖ్యంగా 1999-2004 కాలంలో ఆయన ప్రపంచ బ్యాంకు విధానాలకు లోబడి, పారిశ్రామిక-కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉండటం వికటించింది. ‘చంద్రబాబు మోసగాడు, ప్రపంచబ్యాంకు జీతగాడు’ అనే నినాదమిచ్చి కమ్యూనిస్టులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇద్దరు కమ్యూనిస్టు ముఖ్యనాయకులు ఇటీవల ఒక ప్రయివేటు సంభాషణలో…. ‘చంద్రబాబు పిరికివాడు, జనానికి మీడియాకు భయపడతాడు’ అని, ‘అప్పట్లో ఆయనే ప్రజాకంఠకుడిగా కనిపించినా, తర్వాత వచ్చిన కొందరు పాలకుల నియంతృత్వ`దురహంకార పాలనా పద్దతులు చూశాక, ఆయనే నయమనిపిస్తారు’ అని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును రేఖామాత్రంగానైనా మనకు పట్టిస్తాయి.
‘చంద్రబాబు ఎవరికీ పెద్దగా ఉపయోగకారి కాకపోయినా, అంత ప్రమాదకారి కాద’నే ఒక సానుకూల వ్యాఖ్య ఆయన గురించి వినిపిస్తుంటుంది. అదే సమయంలో, సందర్భాన్ని బట్టి పలువురి సహాయం తీసుకుంటారే తప్ప, అవసరం తీరాక వారిని దూరం కొడతారు (యూజ్ అండ్ త్రో) అనే విమర్శ ఆయనపై ఉంది. కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇటీవలి కాలంలోనే పెంచారు తప్ప, చాలాకాలం వారిని దూరంగానే ఉంచారు. అవసర, కీలక సమయాల్లో సహాయపడిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బామ్మర్థులు హరికృష్ణ, బాలకృష్ణ తదితరుల్ని పరిమితుల మేరకే బాబు అనుమతించేది. లెక్కతప్పుతోందనుకున్నప్పుడు తోక కత్తిరించేది. కానీ, తర్వాతి కాలంలో తనయుడు లోకేశ్, సతీమణి భువనేశ్వరి ప్రాధాన్యత పార్టీలో, ఒకింత ప్రభుత్వంలోనూ పెరిగింది. చివరకు అది ఏ రూపు సంతరించుకుంటుందో చూడాలి.
ఆలోచనలు ఆచరణ మధ్య అంతరం
ఇవాళ కేంద్రంలో పెద్దలు గొప్పగా ప్రచారం చేసుకునే స్వచ్ఛభారత్, మన్ కీబాత్, జన్ ధన్ ఖాతాలు, ముద్రలోన్…… ఇలా చాలా పథకాల వెనుక కాన్సెప్ట్ దశాబ్దాల కిందటే బాబు ఆలోచనల్లో మొగ్గతొడిగి, పథకాల్లో పూలై పూచింది. క్లీన్ అండ్ గ్రీన్, డయల్ యువర్ సీఎం, పరిమిత వడ్డీ రుణాలు, స్వయంసహాయక బృందాలు (డ్వాక్రా) వంటి రకరకాల కార్యక్రమాలకు ఆద్యుడు చంద్రబాబు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే, వెన్నుపోటు విమర్శల నుంచి జనం దృష్టి మళ్లించే క్రమంలో బాబు రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజలవద్దకు పాలన….. ఇలా వేర్వేరు కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో ఉండేట్టు, మీడియా చోటు ఆక్రమించే వ్యూహాలు రచించి, అమలుపరచేది.
కొంత డబ్బు దుర్వినియోగమైనా, అవినీతి పెట్రేగినా…. కొన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు ఆయన హయాంలో అమల్లోకి వచ్చాయి. 74 ఏళ్ల వయసులోనూ బాబు తరగని ఉత్సాహంతో పనిచేస్తుంటారు. అందుకే, ‘రాష్ట్ర విభజన వల్ల ‘బంగారుగుడ్డుపెట్టే బాతు’ వంటి హైదరాబాద్ ను కోల్పోయాం, అనుభజ్ఞుడైన బాబు, కేంద్రంలో మోదీతో కలిసి ఏదైనా మేలు చేస్తారని 2014లో అధికారం కట్టబెట్టిన ఏపీ ప్రజలు వాస్తవంలో ఏదీ పొందక భంగపోయారు. అందుకే, ఆయన్ని 2019 లో ఓడించారు. కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వ పాలనపై విసుగుచెందిన ఏపీ ప్రజలు, ఇటీవలి (2024) ఎన్నికల్లో మరొకమారు బాబుకు పట్టం కట్టారు. రాజధానిలో నిజమైన నిర్మాణాలు చేపట్టి, నమ్మకం కలిగిస్తే, పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేస్తే…. చంద్రబాబు చరిత్రలో నిలుస్తారు. లేకుంటే భారత రాజకీయ చరిత్రలో, కాలం కొలమానాల్లో కేవలం అంకెల కింద మిగిలిపోతారు. ఇదీ నారా చంద్రబాబు నాయుడి ప్రోగ్రెస్ రిపోర్ట్!
-దిలీప్‌రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ
Disclaimer : ఈ ఆర్టికల్ లోని అంశాలు పొలిటికల్ అనలిస్ట్ దిలీప్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయాలు. వీటితో హెచ్.టి.తెలుగుకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదు.
టాపిక్